రాజమండ్రి నుంచి వైసీపీ ఎంపీగా వీవీ వినాయక్....!?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే వస్తున్నాయి.

Update: 2024-01-11 06:15 GMT

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే వస్తున్నాయి. టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ని అందించిన వీవీ వినాయక్ తనదైన బ్రాండ్ క్రియేట్ చేశారు. గోదావరి జిల్లాలకు చెందిన వినాయక్ కి రాజకీయ పట్ల ఆసక్తి ఉందని కూడా ప్రచారంలో ఉన్న మాట.

ఆయన తన రాజకీయాలను ఏ పార్టీ నుంచి ప్రారంభిస్తారు అన్న చర్చ కూడా ఉంది. అయితే వైసీపీ నుంచి ఆయనకు ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. ఇటీవల కాలంలో వినాయక్ వైసీపీ నుంచి ఎంపీ సీటుకు పోటీ చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన రాజమండ్రి నుంచి పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తారు అన్నది తాజాగా వినిపిస్తున్న కధనం.

ఆయన వైసీపీలో చేరి రాజమండ్రి నుంచి తన రాజకీయాలను మొదలెడతారు అని అంటున్నారు. ఇదే విషయం మీద గత వారం రోజులుగా ఎడ తెగని చర్చ అయితే సాగుతోంది. ఇదిలా ఉంటే వైసీపీ అధినాయకత్వం చివరి నిముషంలో వాయిదా వేసిన జాబితాలో రాజమండ్రి నుంచి ఎంపీగా వీవీ వినాయక్ పేరు ఉందని అంటున్నారు.

ఈ మేరకు ఆయనకు ఆ సీటు ఖరారు అయినట్లుగా తెలుగు టీవీ చానళ్ళల్లో పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది. ఇక వినాయక్ కి రాజకీయ పరిచయాలు బాగానే ఉన్నాయి. వినాయక్ కి మాజీ మంత్రి కొడాలి నాని, అలాగే సీనియర్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలతో మంచి స్నేహం ఉంది. ఇపుడు ఈ ఇద్దరు నాయకులు జగన్ తో పాటుగా వైసీపీలో ఉన్నారు.

ఈ ఇద్దరు నేతలు వీవీ వినాయక్ ని ఎంపీ టికెట్ కోసం తమదైన శైలిలో లాబీయింగ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మరో వైపు సినీ నటుడు అలీకి నంద్యాల ఎంపీ టికెట్ ఖరారు అయిందని కూడా మీడియా కధనాలు వచ్చాయి.

మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అఫీషియల్ గా వైసీపీ లాస్ట్ జాబితా రిలీజ్ కావాల్సి ఉంది. ఏది ఏమైనా ఈసారి వైసీపీ జాబితాలో సినీ వాసనలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News