బిగ్ బ్రేకింగ్: వక్ఫ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం.. వాట్ నెక్స్ట్?
జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రిపోర్ట్ ఆధారంగా వక్ఫ్ సవరణ బిల్లుకు ఫిబ్రవరి 19న జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు తెలుస్తోంది.
జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రిపోర్ట్ ఆధారంగా వక్ఫ్ సవరణ బిల్లుకు ఫిబ్రవరి 19న జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జేపీసీ ప్రతిపాదించిన 23 మార్పులలో 14 మార్పులను మంత్రివర్గం ఆమోదించిందని సమాచారం. ఈ నేపథ్యంలో మార్చి 10న కీలక పరిణామం చోటు చేసుకోనుందని తెలుస్తోంది.
అవును... ఈ ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో పార్లమెంటులో ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య ఈ నివేదికను ఉభయసభల్లోనూ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రెండు సభల్లోనూ కార్యకలాపాలు కొద్దిసేపు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో.. జేపీసీ రిపోర్టుల నుంచి కొన్ని అంశాలు తొలగించారంటూ ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు.
ఈ సందర్భంగా బీజేపీ నేత జగదాంబికా పాల్ నేతృత్వంలోని జేపీసీ.. పక్షపాతంతో వ్యవహరించిందని.. సరైన సంప్రదింపులు లేకుండానే బిల్లును తొందరగా అమలు చేశారని మండిపడింది. ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో.. పాల్ వక్ఫ్ బిల్లును సభలో ఆవేశపూరితంగా తీసుకురావడానికి ప్రయత్నించారని ఆరోపించింది.
అయితే.. ఆ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఇందులో భాగంగా... ప్రతిపక్ష వాదనలు సత్య దూరాలని.. జగదాంబికా పాల్ ప్రతీ ఒక్కరి అభిప్రాయాలు వినడానికి ప్రయత్నించారని, సవరణలను ప్రతిపాదించడానికి అందరికీ తగినంత సమయం ఇచ్చారని ప్యానెల్ సభ్యురాలు, లోక్ సభ ఎంపీ అపరాజిత సారంగి తెలిపారు.
ఈ సమయంలో గత వారమే కేంద్ర మంత్రివర్గం జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్టును ఆమోదించిందని.. ఈ నేపథ్యంలో మార్చి 10న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల రెండో భాగంలో ఈ వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ను క్రమబద్ధీకరణ బిల్లుకు లైన్ క్లియర్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
మరోపక్క జేపీసీలో బీజేపీ, దాని అనుబంధ పార్టీల నుంచి 16 మంది ఎంపీలు ఉండగా.. ప్రతిపక్ష పార్టీల నుంచి కేవలం 10 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్లే ప్రతిపక్షాల నుంచి వచ్చిన 44 మార్పులు తిరస్కరించబడ్డాయని.. బీజేపీ చేసిన 23 మార్పుల్లో 14 మార్పులను మంత్రి వర్గం ఆమోదించిందని అంటున్నారు.
ఈ బిల్లు చట్టంగా మారితే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు సభ్యులుగా ఉంటారని అంటున్నారు. దీనిపై స్పందించిన కేంద్రం... వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని చెబుతోంది. అయితే... ఇది మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ విమర్శించారు!
ఈ సందర్భంగా... వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించడంపై ప్రధానంగా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. హిందూ దేవాదాయ-ధర్మాదాయ పరిషత్తులు, క్రైస్తవుల బోర్డులు, సిక్కుల బోర్డుల్లో ఆయా మతాలవారు తప్పిస్తే వేరే మతాలవారు లేనప్పుడు.. ముస్లింల విషయంలోనే అలా చేయాలనుకోవడం ఏమిటని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
దీనిపై ఇప్పటికే స్పందించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. స్వరణలు వక్ఫ్ ప్రయోజనాల కోసం చేసినవి కావని, ఇవి వక్ఫ్ బోర్డుల్ని నాశనం మేసి, కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని పెంచుతాయని ఆరోపించారు. దీనివల్ల ముస్లింలు తమ మసీదులనూ కోల్పోవాల్సి వస్తుందని అన్నారు.
కాగా... జనవరి 29న ముసాయిదా నివేదికను జేపీసీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 15-11 మెజారిటీ ఓటుతో నివేదికను ఆమోదించింది. ఈ సందర్భంగా బీజేపీ సభ్యులు చేసిన 14 సవరణలను కమిటీ ఆమోదించగా.. ప్రతిపక్ష సభ్యులు సూచించిన మార్పులను కమిటీ తిరస్కరించింది!
కమిటీ ఆమోదించిన సవరణల ప్రకారం రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ముస్లిం ఓబీసీ వర్గానికి చెందిన ఒక సభ్యుడు ఉంటాడు. ఇదే సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వాలు అఘాఖానీ, బోహ్ర వర్గాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేసే నిబంధనలు కూడా ఈ సవరణల్లో ఉన్నాయి! ఇదే సమయంలో కుటుంబ వక్ఫ్ లో మహిళల వారసత్వ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించే నిబంధనలు ఉన్నాయి!