వక్ఫ్ బిల్లు ఎఫెక్ట్ : వైసీపీ టీడీపీ జనసేన...ఎవరు సేఫ్ ?

వక్ఫ్ బిల్లుకి ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు ఇచ్చాయి. సహజంగానే ఈ రెండు పార్టీలు ఎన్డీయే కూటమిలో ఉన్నాయి కాబట్టి మద్దతు ఇస్తాయనే అంతా భావించారు.;

Update: 2025-04-04 08:30 GMT
వక్ఫ్ బిల్లు ఎఫెక్ట్ : వైసీపీ టీడీపీ జనసేన...ఎవరు సేఫ్ ?

వక్ఫ్ బిల్లుకి ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు ఇచ్చాయి. సహజంగానే ఈ రెండు పార్టీలు ఎన్డీయే కూటమిలో ఉన్నాయి కాబట్టి మద్దతు ఇస్తాయనే అంతా భావించారు. అదే జరిగింది. ఇక విపక్షంలో ఉన్న వైసీపీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేసింది. మొత్తం మీద చూస్తే వక్ఫ్ బిల్లు ఉభయ సభలలోనూ పాస్ అయింది. ఇక రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారుతుంది.

బీజేపీ సాధించిన మరో విజయంగా దీనిని చూడాల్సి ఉంది. అయితే వక్ఫ్ బిల్లు విషయంలో బీజేపీ స్టాండ్ క్లియర్. ఆ పార్టీ విధానాలు మొదటి నుంచి అందరికీ తెలిసిందే. మరి ఏపీలో మద్దతు ఇచ్చిన వ్యతిరేకించిన పార్టీల విషయం ఏమిటి. వాటికి ఏపీలో ఎంత వరకూ ఈ బిల్లు ఎఫెక్ట్ పడుతుంది అన్నది చర్చగా ఉంది.

ఏపీలో చూస్తే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మైనారిటీల కోసం పనిచేస్తోంది. మైనారిటీ వర్గాలు ఆ పార్టీకి మద్దతుగానే ఉంటూ వస్తున్నాయి. అంతవరకూ ఎందుకు 2024 ఎన్నికల్లో వైసీపీకి సైతం కాదని అత్యధిక శాతం ముస్లిం మైనారిటీలు టీడీపీకి మద్దతుగా నిలిచారు. దాంతో ఏపీలో రాయలసీమ కోస్తాలో కొన్ని చోట్ల మైనారిటీ వర్గాలు బలంగా ఉన్న చోట టీడీపీ మంచి విజయాలను నమోదు చేసింది.

మరి మైనారిటీలు వద్దు అంటున్న వక్ఫ్ బిల్లుకు టీడీపీ సపోర్టు చేసి ఓటు వేసింది. దీని వల్ల మైనారిటీలు దూరం అవుతారా అంటే ఇక్కడే అనేక రకాలైన విశ్లేషణలు ఉన్నాయి. మైనారిటీలు వారి ఓటు బ్యాంక్ ఇవన్నీ గత దశాబ్దం క్రితం ఉన్న భావనలు. నిజంగా అలా ఉందా గుత్తమొత్తంగా వారి ఓట్లు అలా పడుతున్నాయా అన్నది గతంలో జరిగిన చర్చ.

అయితే రాను రానూ మార్పు వస్తోంది. బీజేపీకి చాలా చోట్ల మైనారిటీల మద్దతు దక్కుతోంది. ముస్లింలలో మహిళల కోసం ఆ పార్టీ తీసుకుని వచ్చిన ట్రిపుల్ తలాఖ్ కి వ్యతిరేకమైన బిల్లుకు మహిళల నుంచి మద్దతు దక్కింది. ఇపుడు కూడా చూస్తే వక్ఫ్ ఆస్తుల విషయంలో జరుగుతున్న విధానాలను క్రమబద్ధీకరించేందుకే కేంద్రం ఈ బిల్లు తెచ్చింది.

ఈ బిల్లు వల్ల ముస్లిం మహిళలకు కూడా వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం వస్తుంది పేదలకు న్యాయం జరుగుతుంది. వక్ఫ్ ఆస్తులు లెక్క తెలుస్తాయి. వాటి వల్ల వచ్చే ఆదాయం ఏమిటి అన్నది తెలుస్తుంది. పేదల సంక్షేమం కోసం ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు అన్నది చూస్తారు. దాంతో మహిళలు పేద ముస్లిం వర్గాల మద్దతు ఉంటుందని అంటున్నారు.

గతంలో మాదిరిగా గుడ్డిగా ఒకే మాట మీద ఎవరూ ఆలోచించడం లేదు. ప్రతీ విషయాన్ని వారి వివేచనతో ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఈ బిల్లుకు మద్దతుగా నిలిచిన టీడీపీ జనసేనకు కూడా పెద్దగా ఇబ్బంది అయితే లేదని అంటున్నారు పైగా ఫ్యూచర్ లో లాభం కూడా ఉందని చెబుతున్నారు. ఇపుడు హిందువులు పోలరైజ్ అవుతున్నారు. వారి ఓటు బ్యాంక్ పటిష్టం అవుతోంది.

టీడీపీ జనసేన తీసుకున్న ఈ స్టాండ్ తో ఆ వర్గాలలో మరింతగా ఆదరణ పొందేందుకు అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అంటే ఒక వైపు పెద్దగా నష్టం లేకపోగా మరో వైపు లాభం కలిగే వీలు ఉందని చెబుతున్నారు. ఇక వైసీపీ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం వల్ల మైనారిటీలలో తనకు ఉన్న ప్లేస్ ని కాపాడుకోవచ్చు. అదే సమయంలో పోలరైజ్ అవుతున్న హిందూ సమాజం ఆ పార్టీ విషయంలో ఆలోచించే తీరు కూడా చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు.

వైసీపీ కాంగ్రెస్ లాంటి పార్టీలు మైనారిటీల విషయంలో విప్పుతున్న గళం మెజారిటీ హిందువుల విషయంలో కూడా గట్టిగా విప్పాలని కోరుకునే వర్గాలు ఉంటున్నాయని అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే మెజారిటీ వర్గాలు కూటమిని అట్టిపెట్టుకుని ఉన్న వేళ ఆ వర్గాల ఆదరణను పొందడానికి వైసీపీ తన వంతుగా ప్రయత్నం చేయాల్సి ఉందని అంటున్నారు మొత్తం మీద చూస్తే ఏపీలో వక్ఫ్ బిల్లు ఎఫెక్ట్ అన్నది పెద్దగా రాజకీయ సమీకరణలను మార్చే విధంగా ఉండకపోవచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News