ఆ దమ్ముందా? టీడీపీకి వైవీ సుబ్బారెడ్డి మాస్ సవాల్

రాజ్యసభలో వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ తాను చేసిన ప్రసంగమే ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు.;

Update: 2025-04-05 07:57 GMT
Yv Subba Reddy Challenge in Tdp In Waqf Bill Issue

వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ లో తాము వ్యతిరేకించలేదంటూ తెలుగు తమ్ముళ్లు.. ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంపై స్పందించారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. తాజాగా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. తాము వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదన్న విషయాన్ని నిరూపించే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు.

తాను విసురుతున్న సవాలుకు టీడీపీ స్పందించాలన్న వైవీ సుబ్బారెడ్డి.. ‘‘వక్ప్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని మా పార్టీ విప్ జారీ చేసింది’’ అంటూ తమపై ఆరోపణల్ని చేస్తున్న వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. తమపై విమర్శలు చేస్తున్న టీడీపీ.. వక్ఫ్ బిల్లుపై వ్యతిరేకించలేదన్న సుబ్బారెడ్డి.. తాము వ్యతిరేకించామన్న దానికి లోక్ సభ.. రాజ్య సభల్లో రికార్డు అయిన కార్యకలాపాలే సాక్ష్యమని స్పష్టం చేశారు.

రాజ్యసభలో వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ తాను చేసిన ప్రసంగమే ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు. బిల్లును వైసీపీ వ్యతిరేకించలేదని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా? అని సూటిగా ప్రశ్నించిన వైవీ సుబ్బారెడ్డి.. ‘ఈ విషయాన్ని నిరూపించమని సవాలు విసురుతున్నా. ఫేక్ న్యూస్ ల మీద రాజకీయాలు చేసే అలవాటు మీకు ఎలానూ ఉంది’ అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైవీ సుబ్బారెడ్డి సవాలుకు తెలుగు తమ్ముళ్ల నుంచి కౌంటర్ లేకుండా పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే.. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న నత్వానీ మాత్రం వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఆయన ఓటు విషయంలో కాస్తంత కన్ఫ్యూజన్ చోటు చేసుకుంది. దీనికి కారణం.. తొలుత బటన్ ద్వారా ఓటేసినా.. అది నమోదు కాలేదు. దీంతో కాగితం తెప్పించుకొని ఓటు వేశారు. ఈ ఓటు అనుకూలంగా ఉన్నట్లుగా పలువురు ఎంపీలు చెప్పారు. చివరకు బీజేపీ ఎంపీలు సైతం ఆయన బిల్లుకు మద్దతు ఇచ్చినట్లుగా పేర్కొనటం గమనార్హం.

Tags:    

Similar News