అచ్చ తెలంగాణ యాసలో పెళ్లికార్డు.. భలే ఉంది బాస్
వీటికి భిన్నంగా కరీంనగర్ జిల్లాకు చెందిన పోకల అనే కుటుంబంలో జరుగుతున్న పెళ్లి ముచ్చటను రోటీన్ కు భిన్నంగా ప్రింట్ చేయించారు.
అందరిలా పెళ్లి చేసుకుంటే ప్రత్యేకత ఏముంటుందని కొందరు భావిస్తుంటారు. అలాంటి ఆలోచన ఉన్న వారు తమ పెళ్లిని వినూత్నంగా చేసుకునేందుకు తపిస్తుంటారు. అలాంటి తపించేటోళ్లు వెరైటీగా ఏదో ఒకటి ప్రయత్నిస్తుంటారు. అలాంటి ప్రయత్నమే చేసింది కరీంనగర్ కు చెందిన ఒక జంట. పెళ్లి కార్డు అన్నంతనే సంస్క్రతంలో ఉంటూ.. కొంత అర్థమై.. కొంత అర్థంకాకుండా ఉండే తీరుకు చెక్ చెబుతూ.. అసలుసిసలు తెలంగాణ యాసలో తయారు చేయించిన పెళ్లికార్డు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
ఈ పెళ్లికార్డును చూసిన వారంతా తమ వారికి షేర్ చేసుకుంటున్నారు. రోటీన్ గా ఉండే అన్ని అంశాల్ని మార్చేయటం ఆసక్తికరంగా మారింది. మామూలు శుభలేఖలో పెళ్లిజరిగే తేదీ.. అడ్రస్.. వధూవరుల పరిచయంతో పాటు.. బంధువుల.. విందు ఎక్కడ? ఎన్ని గంటలకు లాంటివి ఉంటాయి. వీటికి భిన్నంగా కరీంనగర్ జిల్లాకు చెందిన పోకల అనే కుటుంబంలో జరుగుతున్న పెళ్లి ముచ్చటను రోటీన్ కు భిన్నంగా ప్రింట్ చేయించారు.
ఈ కార్డులో పేర్కొన్న అంశాల్ని చూసినప్పుడు.. వీలైతే మనం కూడా ట్రై చేద్దాం బాస్ అన్నట్లుగా ఉంది. ఇంతకూ ఆ పెళ్లి కార్డులో ఉన్న వివరాలేంటి? అన్నది యథాతధంగా చూస్తే.. ‘‘స్వర్గంలో ఉన్న ప్రేమగల మా బాపమ్మ.. తాత పోకల నర్సమ్మ - నర్సయ్య, పెద్దబాపు పోకల వెంకట రాములు.. మానెత్తలు - మామలు ఉప్పు వెంకవ్వ - మల్లయ్య, గొంటి మల్లవ్వ - మల్లయ్య, అమ్మమ్మ తాత జోగుల లక్ష్మిదేవి - లస్మయ్య నిండు దీవెనార్తెలతో శ్రావణ నక్షత్రయుక్త తుల లగ్నం పుష్కరాంశ సుముహుర్తంలో మా ఒక్కగానొక్క పిల్లగాడు చి.మధు, లగ్గం చి.ల.సౌ పల్లవితో చేసేందుకు అటోళ్లు ఇటోళ్లు ఖాయం చేసిర్రు.
అందరూ జెర యాది మరిచిపోకుర్రి. అసలే వానలు ఉన్నాయని రాకుండా ఉండేరు. జెర యాల్లపొద్దుగాల్ల వచ్చి మా పిల్ల పిల్లగానికి మీ దీవెనలిచ్చి మా లగ్నం సంబురం చూసిపోతే మా మనస్సు నిమ్మలమైతది. ఇట్లు లగ్గానికి పిలిసేటోళ్లు.. అరుసుకునేటోళ్లు.. అంటూ కార్డును ప్రింట్ చేయించారు. ఈ పెళ్లి కార్డు ఇప్పుడు వైరల్ గా మారింది. అందరి ద్రష్టిని ఆకర్షిస్తోంది.