క్లాస్ రూంలో విద్యార్థితో పెళ్లి ఎపిసోడ్ లో బిగ్ ట్విస్టు

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2025-02-06 05:37 GMT

పశ్చిమ బెంగాల్ లోని ఒక వర్సిటీ క్లాస్ రూంలో ఒక విద్యార్థిని వర్సిటీ మహిళా ప్రొఫెసర్ ఒకరు పెళ్లాడినట్లుగా ఆరోపిస్తూ ఒక వీడియో వైరల్ కావటం.. అదో పెద్ద దుమారంగా మారటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలేం జరిగిందన్న అంశంపై స్పష్టత కోసం వర్సిటీ అధికారులు విచారణ టీంను ఏర్పాటు చేయటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.

పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన నాడియా జిల్లాలోని హరిన్‌ఘాటా క్యాంపస్‌ తరగతి గదిలో విద్యార్థుల ఈ పెళ్లి తంతు జరిగినట్లుగా గుర్తించారు. హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియో బయటకు వచ్చి వైరల్ గా మారింది. అప్లైడ్ సైకాలజీ హెచ్ వోడీగా వ్యవహరిస్తున్న మహిళా ప్రొఫెస్ ఒకరు.. ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పెళ్లాడినట్లుగా వైరల్ వీడియో పేర్కొంది.

అయితే.. ఇదంతా కూడా ఒక డాక్యుమెంటరీలో భాగంగా.. విద్యార్థులంతా మాట్లాడుకొని చేసిందన్న వాదనలు వినిపించాయి. ఈ వీడియో పెను దుమారంగా మారటంతో ఆమెను సెలవు మీద పంపారు. అంతర్గత విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. అయితే.. తాజాగా సదరు మహిళా ప్రొఫెసర్ తన పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని వర్సిటీ రిజిస్ట్రార్ పార్థ ప్రతిమ్ లాహరి వెల్లడించారు.

తనను మానసికంగా ఇబ్బంది పెట్టటమే కాదు.. ఇప్పుడున్న వర్సిటీ పరిస్థితుల నేపథ్యంలో తాను పని చేయలేకపోతున్నట్లుగా ఆమె ఒక లేఖ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ వీడియో మొత్తం ఒక డాక్యుమెంటరీ కోసం షూట్ చేయటం.. ఆ విషయం విద్యార్థులందరికి తెలుసన్న ఆమె.. తాను అంటే పడని ఒక ప్రొఫెసర్ ఈ వీడియోను లీక్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారని పేర్కొన్నారు. తనను దెబ్బ తీయటానికి.. తన కెరీర్ ను నాశనం చేయటానికి చేసిన కుట్రలో భాగంగా ఇదంతా జరిగినట్లుగా ఆమె చెబుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తాను వదిలిపెట్టనని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆమె.. తన జాబ్ కు రిజైన్ చేయాలని డిసైడ్ కావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News