సంక్రాంతి సినిమాల పరిస్థితేంటి?

ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు రేట్లు ఉండవని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది.

Update: 2024-12-22 11:30 GMT

మొత్తానికి పుష్ప-2 గొడవ పుణ్యమా అని.. తెలుగు సినిమా పరిశ్రమకు గట్టి దెబ్బే తగిలేలా ఉంది. ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు రేట్లు ఉండవని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. రేవంత్ రెడ్డి ఇంతకుముందే ఈ దిశగా సంకేతాలు ఇచ్చినప్పటికీ.. అలాంటిదేమీ ఉండదని అనుకున్నారు. కానీ బన్నీ అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలతో ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి సర్కారు చాలా సీరియస్‌గా తీసుకున్నట్లే కనిపిస్తోంది. బన్నీకి పరామర్శల పేరుతో జరిగిన ప్రహసనం.. అరెస్ట్ మీద రేవంత్ రెడ్డి మీద సోషల్ మీడియాలో జరిగిన దూషణల పర్వం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాటల్ని బట్టి చూస్తే ఆయన బన్నీ మీదే కాక టాలీవుడ్ మీద యుద్ధం ప్రకటించినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాను సీఎంగా ఉన్నంత వరకు తెలంగాణలో బెనిఫిట్ షోలు, అదనపు రేట్లు ఉండవని ప్రకటించేశారు. మంత్రి కోమటి రెడ్డి సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

బెనిఫిట్ షోలు, అదనపు రేట్లు రద్దు చేసే విషయం మొన్నటి దాకా ప్రతిపాదనగానే ఉంది. నిన్నటి పరిణామాలతో అది నిర్ణయంగా మారిందని స్పష్టమవుతోంది. ఈ పరిణామం సంక్రాంతి సినిమాలకు గట్టి ఎదురు దెబ్బ అనడంలో సందేహం లేదు. తెలుగు సినిమాలకు నైజాం చాలా కీలకమైన మార్కెట్. ఇక్కడ బిజినెస్ భారీ లెవెల్లో జరుగుతుంది. పెద్ద సినిమాలను చాలా ఎక్కువ రేట్లకు అమ్ముతారు. ఆ రేట్లను రికవర్ చేయాలంటే బెనిఫిట్ షోలు, అదనపు రేట్లు చాలా అవసరం. భవిష్యత్తులో ఏమైనా పరిస్థితులు మారి నిర్ణయం మారుతుందేమో కానీ.. ప్రస్తుతానికి బెనిఫిట్ షోలు, అదనపు రేట్లు కష్టమే అనిపిస్తోంది. ఇది సంక్రాంతి సినిమాలకు మింగుడు పడని విషయమే. మీడియం బడ్జెట్లో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' సంగతి పక్కన పెడితే.. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు బెనిఫిట్ షోలు, అదనపు రేట్లు చాలా అవసరం. అవి లేవంటే బిజినెస్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. 'గేమ్ చేంజర్'ను ప్రొడ్యూస్ చేయడమే కాక.. 'డాకు మహారాజ్'ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు ఇప్పుడు ఏం చేస్తాడన్నది చూడాలి. ఆయనకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నప్పటికీ.. బెనిఫిట్ షోలు, అదనపు రేట్ల విషయంలో ప్రభుత్వం ఓ విధాన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన కోసం తగ్గుతారా అన్నది ప్రశ్న.

Tags:    

Similar News