ఉక్కు విషయంలో ఒక్క మాట చాలదా చిన్నమ్మా ?

కానీ ఏపీకి చెందిన బీజేపీ నేతలు మాత్రం స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని అంటున్నారు.

Update: 2024-09-17 15:13 GMT

విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వాయిదా వేసుకోలేదు అని అంటున్నారు. ఈ విషయంలో బీజేపీ విధాన పరమైన నిర్ణయం కూడా అలాగే ఉంది. కానీ ఏపీకి చెందిన బీజేపీ నేతలు మాత్రం స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని అంటున్నారు.

వారు చెబుతున్న మాటలకు అర్ధాలు వెతుక్కోలేక కార్మిక సంఘాలు అయితే అయోమయంలో పడుతున్నాయి. లేటెస్ట్ గా చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటలో నడవడమే కేంద్రం ఆలోచన అని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.

కేంద్రానికి కానీ బీజేపీకి కానీ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నాశనం చేయాలనే ఆలోచన ఎక్కడా లేదని పురందేశ్వరి అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడి మొత్తం పరిశ్రమను లాభాల్లోకి తీసుకురావాలనేది కేంద్రం ఉద్దేశం అని చెబుతున్నారు. అంతే కాదు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సానుకూలంగా స్పందించారని ఆమె గుర్తు చేస్తున్నారు.

ఆమె చెప్పినది బాగున్నా కార్మికులు మాత్రం డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. లాభాల బాటలో ప్లాంట్ ని నడపడం అంటే ప్రభుత్వ రంగ సంస్థగా నడుపుతారా లేక ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి నడుపుతారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. విశాఖ ప్లాంట్ అక్కడే ఉంటుందని అంటున్నారు. దానికి ఎవరూ తీసుకుని పోరు అని అంటున్నారు.

అది కూడా నిజమే, విశాఖలో లోకేట్ అయి ఉన్న ప్లాంట్ ని అక్కడే ఎవరైనా నడపాలి. అందులో అనుమానం లేదు, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ని నడిపేది ఎవరు అన్నదే అతి పెద్ద ప్రశ్న. ప్రభుత్వం దానిని నిర్వహించి లాభాల బాటలో నడపాలన్నది కార్మిక లోకం డిమాండ్. వారింకా మరో మెట్టు దిగి మరో ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెయిల్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని విలీనం చేయమని అంటున్నారు.

అంటే ఇపుడున్న పేరు కూడా మార్చి సెయిల్ అని పెట్టి ప్రభుత్వం నడపడానికి కూడా అభ్యంతరం లేదు అని అంటున్నారు. అన్నింటికంటే ముందు ఒకే ఒక్క మాట కేంద్రం విస్పష్టంగా ప్రకటించాలని కోరుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ చేసేది లేదు అని చల్లని కబురు కేంద్రం చెబితే చాలు కదా అన్నదే వారి మాట.

అలా అసలు ముక్క చెప్పకుండా ఇన్ని డొంక తిరుగుడు మాటలు ఎందుకు అని అంటున్నారు. విశాఖ ప్లాంట్ కి ఏమీ జరగదు అది బాగానే ఉంటుంది కార్మికుల శ్రేయస్సు పట్టించుకుంటాం ఇలా అనేక రకాలైన ప్రకటనలు బీజేపీ నేతల నుంచి వస్తున్నాయి కానీ కార్మికులు కోరుకుంటున్న ఒకే ఒక్క మాట మాత్రం రావడం లేదు అని అంటున్నారు.

అదే కనుక వస్తేనే విశాఖ స్టీల్ ప్లాంట్ కి అసలైన పరిరక్షణ అని అంటున్నారు అది కాకుండా ఎన్ని కబుర్లు చెప్పినా నమ్మేది ఉంటుందా అని అంటున్నారు. కేంద్రం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. ఆ ప్రకటన రాకుండా ఎవరెన్ని చెప్పినా అది అరకొరగానే ఉంటుంది అని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్రంలో కూడా వారిదే ఉంది. మరి స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ ఉండదు అని చెప్పడానికి అభ్యంతరం ఏమిటి అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News