ఐరన్ డోం అంటే ఏమిటి... దాన్ని ఎలా ధ్వంసం చేశారు?
అవును... ఇజ్రాయేల్ కి ఉన్న ప్రపంచంలోనే అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటైన ఐరన్ డోం వ్యవస్థకు ప్రమాదం జరిగిందని తెలుస్తుంది.
గాజాలో హమాస్ ఉగ్రవాదుల నెట్ వర్క్ ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయేల్ సైన్యం దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో హమాస్ కు మద్దతుగా లెబనాన్ లోని మిలిటెంట్ సంస్థ హెజ్ బొల్లా.. ఇజ్రాయేల్ పై ఎదురుదాడులు చేస్తుంది. హమాస్ పై దాడులు ఆపని పక్షంలో తమ ఎంట్రీ తప్పదని ముందుగా హెచ్చరించినట్లుగా ఆ పనికి పూనుకుంది. ఈ సమయంలో ఇజ్రాయేల్ కలిగి ఉన్న అత్యంత దుర్భేద్యమైన ఐరన్ డోం వ్యవస్థపై ఈ సంస్థ దాడి చేసిందని.. దీంతో ఆ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలుస్తుంది.
అవును... ఇజ్రాయేల్ కి ఉన్న ప్రపంచంలోనే అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటైన ఐరన్ డోం వ్యవస్థకు ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఉత్తర ఇజ్రాయెల్ లోని రెండు ఐరన్ డోం వ్యవస్థలపై దాడి చేసినట్లు హెజ్ బొల్లా సంస్థ ప్రకటించుకుంది. ఇదే సమయంలో తాము ఐరన్ డోం పై చేసిన దాడిలో రెండు లాంచింగ్ ప్లాట్ ఫాంలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపింది.
దీంతో ఇజ్రాయేల్ గతనతలంలో ఉన్న అత్యంత దుర్భేద్యమైన వ్యవస్థ ధ్వంసం అవుతుందనే చర్చ మొదలైంది. ఇది ఇజ్రాయేల్ కు తీవ్ర నష్టం కిందే లెక్క. అయితే... ఐరన్ డోం పై దాడులు చేసి లాంచింగ్ ప్లాట్ ఫాం లను ధ్వంసం చేసినట్లు హెజ్ బొల్లా చేసిన ప్రకటనపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు. కానీ... ఈ మిలిటెంట్ గ్రూప్ ను లక్ష్యంగా చేసుకుని దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసినట్లు తెలుస్తుంది.
దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ మొదలైన దాడుల్లో ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తున్నప్పటికీ... ఇజ్రాయేల్ - హెజ్ బొల్లా ల పోరు పెను ప్రమాదాలకు కారణమవ్వొచ్చనే కామెంట్లు మాత్రం వినిపిస్తున్నాయి.
కాగా ఈ ఏడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడుల నేపథ్యంలో.. అందుకు ప్రతీకారంగా నాటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇజ్రాయేల్ సైన్యం గాజాను అష్ట దిగ్బంధం చేయడంతో.. స్థానికంగా నీళ్లు, ఆహారం, ఔషధాలు, ఇంధనం కొరత నెలకొంది. ఈ సమయంలో హమాస్ కు మద్దతుగా ఇప్పుడు హెజ్ బొల్లా కూడా ఎంటరై.. ఏకంగా ఐరన్ డోం నే ధ్వంసం చేయడం గమనార్హం.
ఐరన్ డోం వ్యవస్థ అంటే ఏమిటి..?:
ఐరన్ డోం అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటి. ఇజ్రాయెల్ కు చెందిన రఫేల్ సంస్థ దీన్ని అభివృద్ధి చేయగా... అందుకు అమెరికా తోడ్పాటు అందించింది. శత్రువులు ప్రయోగించే రాకెట్లను దీనిలోని డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రాడార్ పసిగట్టి.. ఆ రాకెట్ గమనానికి సంబంధించిన సమాచారాన్ని ఆయుధ నియంత్రణ వ్యవస్థకు చేరవేయడం దీని పని. దీంతో ఆ వ్యవస్థ.. రాకెట్ దిశగా క్షిపణిని ప్రయోగించి దాన్ని గాల్లోనే ధ్వంసం చేస్తుంది.
కాగా... ఇజ్రాయేల్ దేశం ఈ దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థ ఐరన్ డోం ను 2011 నుంచి వినియోగంలోకి తీసుకొచ్చింది. అందుకు కారణం... 2006లో జరిగిన లెబనాన్ ఘర్షణల సమయంలో హెజ్ బొల్లా సంస్థ... ఇజ్రాయెల్ పై వేల రాకెట్లతో విరుచుకుపడటమే. ఈ దాడుల్లో అనేకమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇలాంటి దాడులను తిప్పికొట్టడానికి గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది! ఆ నిర్ణయ ఫలితమే ఐరన్ డోం వ్యవస్థ!