ఒక్క క్లిక్ .. వాట్సాప్‌లో ఈ ఫోటోలు తెరిస్తే అంతే సంగతులు!

ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్ మోసాలు కూడా ఎక్కువవుతున్నాయి. తాజాగా, సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు.;

Update: 2025-04-16 05:13 GMT
ఒక్క క్లిక్ .. వాట్సాప్‌లో ఈ ఫోటోలు తెరిస్తే అంతే సంగతులు!

ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్ మోసాలు కూడా ఎక్కువవుతున్నాయి. తాజాగా, సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. ఇది సాధారణ లింక్‌లను క్లిక్ చేయడం లేదా ఓటీపీలను నమోదు చేయడం వంటివి కాకుండా, కేవలం ఒక ఫోటోను తెరవడం ద్వారా మీ వ్యక్తిగత డేటాను తస్కరించే ప్రమాదకరమైన పద్ధతి ఫాలో అవుతున్నారు. ఈ మోసం ఎలా జరుగుతుందో తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలి.

ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ఆన్‌లైన్ మోసాలు కూడా ఎక్కువవుతున్నాయి. తాజాగా, సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. ఇది గుర్తించడం చాలా కష్టం, ఎందుకంటే ఇది మిమ్మల్ని లింక్‌పై క్లిక్ చేయమని అడగదు లేదా మీ ఫోన్‌లోని వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయదు. అంతేకాకుండా, ఇది ఓటీపీ లేదా మీ వివరాలను ఏదైనా స్లాట్‌లో నమోదు చేయమని కూడా అడగదు.

మీ వాట్సాప్‌ కు బ్లర్ ఇమేజ్ పంపిస్తారు. దానిని తెరవగానే మాల్వేర్ పని చేయడం ప్రారంభిస్తుంది. సైలెంటుగా మీ ప్రైవేట్ డేటా, ఇతర యాప్‌లు, మొత్తం గాడ్జెట్‌ను యాక్సెస్ చేస్తుంది. సైబర్ నేరగాళ్లు నెటిజన్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నారు. హానికరమైన డేటాను ఒక ఫోటోలో చాలా తెలివిగా దాచిపెడుతున్నారు. మీరు దానిపై క్లిక్ చేసిన వెంటనే మోసానికి గురవుతారు.

ఈ మోసం ఎలా పనిచేస్తుంది?

మోసగాళ్లు మీ వాట్సాప్‌కు అనుమానం కలిగించని ఒక ఫోటో పంపిస్తారు. సాధారణంగా తెలియని నంబర్ నుండి పంపుతారు. అది మామూలు ఫోటోగా కనిపించినప్పటికీ, మీ బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, యూపీఐ సమాచారం దొంగిలించడానికి, మీ ఫోన్‌ను ఆపరేట్ చేసేందుకు రూపొందించిన మాల్వేర్ దానిలో దాగి ఉంటుంది. అది మీకు తెలియదు.

ఫోటో లోపల హానికరమైన డేటాను దాచే ఈ టెక్నిక్‌ను స్టెగానోగ్రఫీ అంటారు. అత్యంత సాధారణ రకం లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ (LSB) స్టెగానోగ్రఫీ, ఇది చిత్ర ఫైల్ అతి చిన్న భాగంలో మాల్వేర్‌ను దాచిపెడుతుంది. మీరు చిత్రాన్ని తెరిచిన క్షణంలోనే మీ ఫోన్ హ్యాక్ చేయవచ్చు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ఒక వ్యక్తి ఇదే విధంగా దాదాపు రూ. 2 లక్షలు కోల్పోయిన తర్వాత ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

అతనికి వాట్సాప్‌లో ఒక తెలియని నంబర్ నుండి ఒక ఫోటో వచ్చింది. అందులో ఉన్న వ్యక్తిని గుర్తించాలని కోరారు. అతను వెంటనే దాన్ని ఓపెన్ చేయలేదు కానీ అదే నంబర్ నుండి అనేకసార్లు కాల్స్ రావడంతో, చివరకు అతను దానిపై క్లిక్ చేశాడు. అతని ఫోన్ హ్యాక్ అయింది. అతని బ్యాంక్ వివరాలు చోరీ చేశారు. దీంతో అతని ఖాతాలోని డబ్బు విత్‌డ్రా అయింది.

ఇలాంటి మోసాల నుండి సురక్షితంగా ఉండటానికి ఏమి చేయాలి:

* తెలియని నంబర్ల నుండి వచ్చే చిత్రాలు, వీడియోలు లేదా లింక్‌లను ఎప్పుడూ తెరవకండి లేదా డౌన్‌లోడ్ చేయకండి.

* మీ వాట్సాప్ సెట్టింగ్‌లలో మీడియా కోసం ఆటో-డౌన్‌లోడ్‌ను ఆఫ్ చేయండి.

* ట్రూకాలర్ వంటి కాలర్ ఐడి యాప్‌లను ఉపయోగించండి.

* మీ ఫోన్ సాఫ్ట్‌వేర్, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి.

* ఏదైనా నంబర్‌పై అనుమానం వస్తే, దాన్ని బ్లాక్ చేయండి, అధికారులకు తెలియజేయండి.

* మీరు మోసపోయారని గ్రహిస్తే, వెంటనే cybercrime.gov.in కు తెలియజేయండి.

Tags:    

Similar News