కంప మీద కాలేసి వెనక్కి తీసుకున్న కర్ణాటక సీఎం!
కన్నడ ప్రజల కోసం చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొంటూ కర్ణాటక ముఖ్యమంత్రి ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్ల ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు.
కాలం మారింది. ప్రజల మైండ్ సెట్ లోనూ మార్పు వచ్చింది. కొన్ని అంశాలకు సంబంధించి వీలైనంత దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అలియాస్ సిద్ధూ మిస్ అయ్యారు. ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఆగమాగం చేయటమే కాదు.. చివరకు వెనక్కి తగ్గాల్సిన దుస్థితి. అదే సమయంలో బెంగళూరు బ్రాండ్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న వాదన వినిపిస్తోంది. కర్ణాటకలోని ప్రైవేటు కంపెనీల్లో గ్రూప్ సీ.. డీ గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ముందుకు తీసుకొచ్చిన సిద్దూ సర్కారు.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో వెనక్కి తగ్గింది.
కన్నడ ప్రజల కోసం చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొంటూ కర్ణాటక ముఖ్యమంత్రి ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్ల ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రైవేటురంగంలో కన్నడవాసులకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయని.. దీన్ని సరిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశంగా పేర్కొన్నారు. అయితే.. ఈ అంశం పెను దుమారాన్ని రేపింది.
ఎందుకిలా? అంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందునా ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించి ప్రాంతం.. కులం.. మతం లాంటి అంశాలకు ఎంత దూరంగా ఉండగలిగితే అంత మంచిది. ఉదాహరణకు హైదరాబాద్ నే తీసుకుందాం. ఈ మహానగరంలోని అత్యధిక రెస్టారెంట్లలో ఒడిశా రాష్ట్రానికి చెందిన వారే పని చేస్తుంటారు. సిద్ధూ తీసుకున్న తరహాలోనే తెలంగాణలోనూ తీసుకుందామని అనుకుందాం. అప్పుడేం జరుగుతుందన్నది అంశాన్ని చూస్తే.. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలోని తీవ్రత ఇట్టే అర్థమవుతుంది.
హైదరాబాద్ లోని హోటల్ ఇండస్ట్రీ మొత్తంలోనూ పెను దుమారం రేగటమే కాదు.. అవసరమైన ఉద్యోగులు దొరకని పరిస్థితి. కారణం.. రెస్టారెంట్లలో పని చేసే ఒడిశాకు చెందిన వారు తక్కువ జీతాలకే పని చేస్తారు. ఆ జీతాలకు తెలంగాణలోని యువత పని చేయటానికి ఆసక్తి చూపరు. చట్టం ప్రకారం ప్రైవేటు రెస్టారెంట్లలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని తప్పనిసరిగా 50 శాతం మందిని రిక్రూట్ చేసుకోవాలంటే.. అంత మంది లభించే వీల్లేదు. అలా చేయాలంటే జీతాల్ని డబుల్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎన్నో. ఇప్పటికే బెంగళూరులో మౌలిక వసతుల లేమితో పాటు.. ఖర్చు అధికంగా ఉంటుందన్న కారణంగా చాలామంది బెంగళూరును వదిలేసి హైదరాబాద్ ను ఎంచుకుంటున్న పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి మౌలిక వసతుల మీద ఫోకస్ చేయాల్సిన ప్రభుత్వం దాన్ని వదిలేసి.. ప్రైవేటు సంస్థల్లో యాభై శాతం ఉద్యోగాల్ని కన్నడిగులకే ఇవ్వాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం బ్రాండ్ బెంగళూరును దెబ్బేయటమేనని చెప్పాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్కారు తీసుకున్న నిర్ణయంపై నాస్కామ్ సైతం స్పందించింది. ఈ నిర్ణయం హైదరాబాద్ కు మేలు జరుగుతుందని.. ఎక్కువమంది హైదరాబాద్ కు వెళ్లిపోతారని పేర్కొంది.
ఇలాంటి నిర్ణయాలు ఎన్నో అంశాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. సిద్ధూ సర్కారు ప్రతిపాదన అమల్లోకి వస్తే ఐటీ కంపెనీల పరిస్థితేంటి? అక్కడి ఐటీ కంపెనీల్లో 90 శాతం వరకు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారు. అలాంటప్పుడు కేవలం కన్నడిగులకే కొలువుతు ఇవ్వాలంటే పెట్టుబుడులు పెట్టాలనుకున్న వారు సైతం ముందుకు రాని పరిస్థితి. ఇలాంటి విపరిణామాలెన్నో.
సిద్ధూ సర్కారు ప్రతిపాదనపై ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు సైతం ప్రభుత్వ ప్రతిపాదనపై తలలు పట్టుకున్న పరిస్థితి. బ్రాండ్ బెంగళూరుకు ఉరి వేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమా? అన్న తీవ్ర వ్యాఖ్యలు పలువురి నోట వినిపించాయి. సిద్ధూ సర్కారు తీసుకున్న నిర్ణయం అధికారికమైతే.. దాని విపరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే కర్ణాటకను వీడిపోవటానికి మినహా తమకు మరో మార్గం లేదన్న హెచ్చరికలు కూడా ప్రభుత్వానికి వెళ్లినట్లుగా సమాచారం. దీంతో.. తాను తీసుకున్న నిర్ణయం కంప మీద కాలేయటం లాంటిదన్న విషయం ముఖ్యమంత్రికి అర్థమైందని చెబుతున్నారు. దీంతో.. ఈ ప్రాతిపదనను వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించారు. అయినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాలానికి తగ్గట్లు కొన్ని అంశాల విషయాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా ఏదో చేయాలని భావిస్తే మరేదో అవుతుంది. ఇదంతా చూసిన తర్వాత కంప మీద కాలేయటం ఎందుకు? ఎందుకు వేశామా? అని ఫీల్ కావటం ఎందుకు? సాఫీగా సర్కారును నడపాల్సింది పోయి.. అనవసరమైన ఆవేశాలు అవసరమా సిద్ధూ?