ఉచిత బస్సు పధకం ఇప్పట్లో కాదా ?
ఏపీలో అయితే కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తి అయిపోయాయి.
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారు అంటే ఈ ప్రశ్నకు జవాబు టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. తెలంగాణాలో అయితే అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసి చూపించారు. కర్ణాటకలోనూ ఆలస్యం జరగలేదు. ఏపీలో అయితే కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తి అయిపోయాయి. ఇంకా స్టడీ అంటూనే ఉన్నారు
అయితే దీని మీద ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నివేదికని సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇచ్చేశామని చెప్పారు. దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.
అయితే గత నెలలో ఇదే విషయం మీద ప్రభుత్వ పెద్దలు మరోసారి అధ్యయం చేయిస్తామని చెప్పినట్లుగా ప్రచారంలో ఉంది. తెలంగాణా కర్ణాటకలలో అమలులో ఉన్న ఉచిత బస్సు పథకం దానికి ఏపీలో ఎలా అమలు చేయాలి అన్న దాని మీద నివేదికను సిద్ధం చేయాలని అవసరమైతే మరోసారి వెళ్ళి స్టడీ చేయాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి.
దీని కంటే ముందు ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే నివేదికను తయారు చేయమని పురమాయించారు. ఆ తరువాత ఆర్టీసీ అధికారులు ఆ రెండు రాష్ట్రాలు తిరిగి నివేదికను సిద్ధం చేసి ఇచ్చారు మరి దాని మీద మరోసారి స్టడీ చేసి ఇచ్చిన నివేదిక ప్రభుత్వం వద్ద ఉందా లేక పాత నివేదిక ఉందా అన్నది కొనకళ్ల నారాయణరావు చెప్పలేదు
అయితే నివేదిక ఏది అయినా ఏముంది ఈ పధకం ఖర్చుతో కూడుకున్నది అందువల్ల వీలైనంత వరకూ వాయిదా వేసే క్రమంలోనే మరోసారి అధ్యయనం అంటున్నారు అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రవాణా మంత్రి కూడా ఈ మధ్య ఉచిత బస్సు పథకం గురించి ఎక్కడా మాట్లాడడం లేదు
ప్రభుత్వం అయితే దీపావళి నుంచి మూడు గ్యాస్ సిలెండర్లను ఉచితంగా అందించాలన్న పధకం మీదనే దృష్టి పెట్టింది. దీని మీదనే ఈ నెల 16న జరిగే మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. ఇపుడు కొత్తగా చైర్మన్ గా వచ్చిన నారాయణరావు మాత్రం నివేదిక ఎపుడో రెడీ అని చెప్పిన ప్రకటనతో కూటమి ప్రభుత్వం మీదనే అంతా చూస్తున్నారు.
నివేదిక సిద్ధంగా ఉన్నపుడు ఉచిత బస్సు ప్రయాణం పధకం అమలు చేయడానికి అభ్యంతరం ఏమిటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే నిధుల సమస్య వల్లనే ఇది వాయిదా పడుతోందని అంటున్నారు. కొత్త చైర్మన్ ఉత్సాహంతో మీడియా ముందు నివేదిక గురించి చెప్పేశారు కానీ కూటమి ప్రభుత్వం కష్టాలు వారివి అని అంటున్నారు. మరి ఇదిపుడు విపక్షాలు అస్త్రంగా మారుతుంది అని కూడా అంటున్నారు. నివేదిక సిద్ధం అయితే ఇంకా ఎందుకు ఆలస్యం, పధకాన్ని అమలు చేయండి అని రేపటి నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తాయి అపుడు కూటమి ప్రభుత్వ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.