సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. ఎప్పటి నుంచి అంటే..?
శుక్రవారం నిర్వహించిన కలెక్టర్ సమావేశంలో ఈ మేరకు ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఆకస్మిక పర్యటనలు, తనిఖీలకు సిద్ధమవుతున్నారు. ఈనెల 26 నుంచి ఆకస్మిక తనిఖీలను చేపడతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన కలెక్టర్ సమావేశంలో ఈ మేరకు ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు.
ఈ తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని రేవంత్ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఈ ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని అధికారులకు తెలియజేయాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. నిరుపేదల సంక్షేమంతోపాటు రాష్ట్ర అభివృద్ధి తనకు రెండు కళ్ళు అని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి.. ప్రజా ప్రభుత్వం అన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకొని అందుకు అనుగుణంగా నడుచుకోవాలని వెల్లడించారు.
బాధ్యతతో వ్యవహరించి ప్రజల నమ్మకాన్ని పొందాలని అధికారులకు రేవంత్ సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల ప్రభుత్వానికి ప్రతినిధులు అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ అధికారుల పనితీరు మెరుగ్గా ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఈ మేరకు అధికారులు నడుచుకోవాలన్నారు. రాష్ట్రంలో సోషియో - ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయిమెంట్, పొలిటికల్, కుల గణనకు సంబంధించిన సర్వేను విజయవంతంగా నిర్వహించిన కలెక్టర్లను ఈ సందర్భంగా సీఎం అభినందించారు.
ఈనెల 26 నుంచి చేపట్టనున్న క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా అనేక అంశాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించే అవకాశం ఉంది. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ వసతి గృహాలను సందర్శించి ఆ రాత్రి అక్కడే నిద్రించేలా చూడాలని ఆదేశించారు. రైతు భరోసా పథకం అమలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పథకానికి సంబంధించి కీలకమైన ఆదేశాలను సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు అందించారు. ఈ పథకాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 26న ప్రారంభించనున్నారు.
గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేకత ఉందని, 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఘనంగా నిర్వహించేలా అధికారులకు సీఎం ఆదేశాలను జారీ చేశారు. రైతు భరోసా పథకంలో భాగంగా 12 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. వ్యవసాయ కూలీలకు కూడా 12,000 ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు మరో కీలకమైన ఆదేశాన్ని జారీ చేశారు. గ్రామ సభలను నిర్వహించి లబ్ధిదారుల వివరాలను వెల్లడించాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా వార్డు స్థాయిలో ఈ తరహా నిర్వహించాలని ఆదేశించారు.