నిజం..గంటలో న్యూయార్క్ నుంచి లండన్ కు..విమానంలో కాదు రైల్లోనే

అచ్చంగా 5 వేల కిలోమీటర్లు.. 3,500 మైళ్లు.. కేవలం గంటలోనే చేరుకోవచ్చంటే నమ్ముతారా..?

Update: 2024-12-12 00:30 GMT

అచ్చంగా 5 వేల కిలోమీటర్లు.. 3,500 మైళ్లు.. కేవలం గంటలోనే చేరుకోవచ్చంటే నమ్ముతారా..? నమ్మొచ్చు.. ఎందుకంటే.. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి.. ఆ మధ్య సూపర్ సోనిక్ విమానాన్ని డెవలప్ చేస్తున్నారనే కథనాలు వచ్చాయి కాబట్టి.. అయితే ఆగండాగండి.. ఇక్కడే ఉంది పెద్ద ట్విస్ట్..

ఆ విమానం ఏమైందో..?

అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్. యూకే రాజధాని లండన్.. వీటి మధ్య దూరం 5,586 కిలోమీటర్లు. మధ్యలో అంతా అట్లాంటిక్ మహా సముద్రమే. సహజంగా అయితే 8 గంటల 10 నిమిషాలు పడుతుంది ప్రయాణానికి. అదికూడా గంటకు 900 కిలోమీటర్ల వేగంతో వెళ్లే నాన్ స్టాప్ విమానం అయితే. కానీ, దీనిని గంటన్నరలో ముగించేలా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సూపర్ సోనిక్ విమానాన్ని రూపొందిస్తోంది అనే కథనాలు వచ్చాయి. మాక్ 2 నుంచి మాక్ 4 మధ్య వేగంతో వెళ్తుంది ఈ విమానం. దీనిని నాసా ఎక్స్59 X-59గా పేర్కొంటోంది. క్వెస్ట్ మిషన్ లో భాగంగా నాసా ఈ విమానాలను సిద్ధం చేస్తోంది. ఇవి గంటకు 1,545 మైళ్ల నుంచి 3,045 మైళ్ల వేగంతో వెళ్తాయి.

కానీ, ఇది రైలు

లండన్-న్యూయార్క్ లేదా న్యూయార్క్-లండన్ మార్గం ఏదైనా కానీ.. కేవలం గంటన్నరలో చేరేలా మాక్ 4.. గంటకు 3 వేలపైగా మైళ్ల వేగంతో కమర్షియల్ విమానాలను నడిపే సాధ్యాసాధ్యాలపై నాసా అధ్యయనం చేస్తున్నదని చెప్పుకొన్నాం కదా.. దీనికి అది ప్రపంచవ్యాప్తంగా 50 విమాన మార్గాలను గుర్తించింది కూడా. ప్రస్తుతం అమెరికా సహా చాలా దేశాలు తమ గగనతలంలో సూపర్ సోనిక్ విమానాల రాకపోకలను నిషేధించాయి. భద్రతా పరమైన అంశాల కంటే దీనికి శబ్ధ కాలుష్యాన్ని ప్రధాన కారణంగా చెప్పాయి. ఈ నేపథ్యంలో సూపర్ సోనిక్ విమానాల శబ్ధాన్ని గణనీయంగా తగ్గించడానికి నాసా కృషి చేస్తోంది. మరోవైపు, ప్రయాణికుల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుంటోంది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమంటే.. విమానం కంటే వేగంగా గంటలోనే న్యూయార్క్ నుంచి లండన్ కు వెళ్లేలా రైలును సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అట్లాంటిక్ ను దాటుతూ..

న్యూయార్క్ ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం ఒడ్డున ఉంది. లండన్ నార్త్ సీలోకి వెళ్లే థేమ్స్ నది ఒడ్డున ఉంది. మరి వీటికి రైలు మార్గం ఎలానా? అని అంటారా? అట్లాంటిక్ మహా సముద్రంలో ట్రాన్స్ అట్లాంటిక్ టన్నెల్ నిర్మిస్తున్నారు. దీని ద్వారా రైల్లో 54 నిమిషాల్లోనే చేరవచ్చట. దీనికి దాదాపు 19.8 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. అయితే, ఇప్పుడు అప్పుడే ఇది అందుబాటులోకి రాదు. ఇందుకు కనీసం పదేళ్లు పట్టే చాన్స్ ఉందట.

Tags:    

Similar News