కాంగ్రెస్ గెలిచే చోటా ఓడిన వైనం..ఏంటి కారణాలు?
ఇది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు తాజాగా రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారీ ఎదురు దెబ్బే తగిలింది. గెలిచేందుకు ఎంతో అవకాశం ఉండి.. గెలుస్తారన్న ధీమా కూడా ఉన్న హరియాణాలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. వాస్తవానికి ఏ రాష్ట్రంలో అయినా.. ఒక పార్టీ వరుసగా మూడు సార్లు అధికారం దక్కించుకున్న దాఖలాలు ఇటీవల కాలంలో అయితే లేవు(ఒక్క గుజరాత్ మినహా). అలాంటిది తొలిసారి గుజరాత్‌కు ఆవల హరియాణాలో వరుసగా మూడోసారి బీజేపీ ఏకపక్షంగా విజయం దక్కించుకుంది. ఇది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
హరియాణ ఎన్నికల షెడ్యూల్ నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ప్రజల నాడిని పట్టుకున్న అనేక సర్వేలు.. కాంగ్రెస్ దే అధికారమని ఢంకా భజాయించి మరీ చెప్పాయి. కొన్ని కొన్నిసర్వేలు..ఏకపక్షంగా పోలింగ్ జరిగినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నాయి. ఇక, మంగళవారం ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తొలి రెండు రౌండ్లు కూడా.. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోనే కొనసాగింది. దీంతో ఇంకేముంది.. తాము గెలిచేస్తున్నాం.. అంటూ పార్టీ కార్యాలయాల వద్ద మిన్నంటిన సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.
కానీ, గంటలు గడుస్తున్నకొద్దీ.. రౌండ్లు పెరుగుతున్న కొద్దీ.. కాంగ్రెస్ వెనుకబడి పోవడం.. కమల వికాసం కనిపించడంతో సర్వ త్రా.. బాంబు పేలినంత విస్మయం.. అసలు ఏం జరుగుతోంది? అని అనేక మంది విస్మయం వ్యక్తం చేశారు. వెరసి.. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి బీజేపీ కూటమి 48 స్థానాల్లో విజయం దక్కించుకుంది. ఇక, కాంగ్రెస్ పార్టీ 36 స్థానాలకే పరిమితం అయింది. ఇతరులు 5 స్థానాల్లో విజయం దక్కించుకున్నారు. ఈ ఫలితాలు ఎలా ఉన్నా.. అసలు అనేక ఇబ్బందులతో బీజేపీ ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోవడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిపోయింది.
ఏంటి కారణాలు?
బీజేపీ వ్యతిరేకతను అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా జేజేపీ వంటి పార్టీలు బీజేపీని వ్యతిరేకించిన తర్వాత.. ఆ పార్టీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్న తర్వాతకూడా.. కాంగ్రెస్ పుంజుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక, బ్రాహ్మణ, క్షత్రియ సామాజిక వర్గాలను ఆకట్టుకోవడంలోనూ కాంగ్రెస్ విఫలమైంది. ప్రధానంగా.. అగ్నివీర్‌ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ హామీని ప్రజలు విశ్వసించలేకపోయారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధరల ప్రకటన విషయంలోనూ.. బీజేపీని దీటుగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనలేక పోయింది. ఇక, మోడీ, అమిత్ షా ధ్వయానికి చెక్ పెట్టడంలోనూ రాహుల్ గాంధీ దూకుడు ఏమాత్రం పనిచేయలేక పోయింది. అందుకే.. గెలిచే అవకాశం ఉన్న చోట కూడా.. కాంగ్రెస్ పార్టీ పట్టాలు తప్పేసింది.