సరాసరి రోజుకు వెయ్యి... ఏమిటీ వైట్‌ పాస్ఫరస్‌ బాంబులు?

హమాస్‌ ఉగ్రవాదుల్ని ఏరివేసే లక్ష్యంతో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో భూతల పోరు ప్రారంభం కాబోతోంది

Update: 2023-10-14 03:53 GMT

హమాస్‌ ఉగ్రవాదుల్ని ఏరివేసే లక్ష్యంతో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో భూతల పోరు ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు ఇప్పటికే హెచ్చరికలు పంపేసింది ఇజ్రాయేల్ సైన్యం. ఆ సంగతి అలా ఉంటే... గాజాలోని 3,600 హమాస్‌ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ ఇప్పటికే ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయేల్ పై ఒక భారీ ఫిర్యాదు చేస్తుంది న్యూయార్క్‌ కు చెందిన హ్యుమన్‌ రైట్స్‌ వాచ్‌ అనే సంస్థ.

అవును... హమాస్ ఉగ్రవాది అనేవాడు గాజాలో కనిపించకుండా చేస్తామని, పురుగును నలిపినట్లు నలిపేస్తామని, ఆ మానవమృగాల వేటకు ఎంతవరకైనా వెళ్తామని ఇప్పటికే ఇజ్రాయేల్ ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాటలకు తగ్గట్లుగానే చేతలూ ఉంటున్నాయి. ఈ సమయంలో ఉద్రిక్తతలు మొదలైన ఈ ఆరు రోజుల్లో.. ఆరు వేల బాంబులను గాజాపై జారవిడిచినట్లు ఇజ్రాయేల్ తెలిపింది. వీటి బరువు నాలుగు వేల టన్నులని పేర్కొంది.

ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ కు చెందిన హ్యుమన్‌ రైట్స్‌ వాచ్‌ అనే సంస్థ ఇజ్రాయెల్‌ పై సంచలన ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగా ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌ వైట్‌ పాస్ఫరస్‌ బాంబులు ఉపయోగిస్తోందని ఆరోపించింది. అక్టోబరు 10న లెబనాన్‌ పైనా, అక్టోబరు 11న గాజాపైనా ప్రయోగించిన ఆయుధాలకు సంబంధించిన వీడియోలను పరిశీలిస్తే.. వాటిలో వైట్ పాస్ఫరస్‌ ఆనవాళ్లు ఉన్నాయని ఇజ్రాయెల్‌ పై ఆరోపణలు గుప్పించింది.

ఈ వైట్ పాస్ఫరస్‌ బాంబులు పౌరులపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయట. దీంతో హ్యుమన్‌ రైట్స్ వాచ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ ఆరోపణలపై సీరియస్ గా రియాక్ట్ అయిన ఇజ్రాయెల్‌ సైన్యం... గాజాలో వైట్ పాస్ఫరస్‌ బాంబులు ప్రయోగించలేదని చెబుతోంది. వాస్తవానికి ఇజ్రాయేల్ పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇది తొలిసారి కాదు. 2008-09లో గాజాపై వైట్‌ పాస్ఫరస్‌ బాంబులను ఇజ్రాయెల్‌ ప్రయోగించిందని చెబుతారు.

ఈ నేపథ్యంలో... 2013లో అంతర్జాతీయ సమాజం నుంచి ఈ వైట్ పాస్ఫరస్ బాంబుల వినియోగం పై వచ్చిన ఒత్తిడి కారణంగా.. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశామని ఇజ్రయేల్ ప్రకటించుకుంది. ఈ క్రమంలో.. తాజాగా ఇజ్రాయెల్‌ వీటిని మరోసారి గాజాపై ప్రయోగించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే... వాస్తవానికి, అంతర్జాతీయ చట్టాల ప్రకారం వైట్‌ పాస్పరస్‌ బాంబుల వినియోగంపై ఎలాంటి నిషేధం లేదు.

ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఈ బాంబుల వినియోగం గట్టిగా ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. తమ సైన్యంపై రష్యా.. వైట్‌ పాస్ఫరస్‌ బాంబులు ప్రయోగించిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.

అయితే... ఇలాంటి బాంబులు యుద్ధంలో భారీగా పొగను సృష్టిస్తాయి. బంకర్‌ లు, భవనాలను నాశనం చేసేందుకు ఈ వైట్ పాస్ఫరస్‌ బాంబులను ఉపయోగిస్తారట. వాటి నాశనాల సంగతి అలా ఉంటే... ఇవి మనుషులపై మాత్రం తీవ్ర ప్రభావం చూపిస్తాయని, దీర్ఘకాలిక రోగాలకు కారణమవుతాయని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News