ఎవరీ ఆస్థా.. పుట్టగానే సెలబ్రిటీ.. ఇప్పుడేం చేస్తోంది.

అంతటి గౌరవ మర్యాదలకు కారణం.. ఆమె భారతావని శతకోటి చిన్నారి కావటమే.

Update: 2025-01-02 17:30 GMT

ఆమె పుట్టుకే ఒక స్పెషల్. దేశంలో కోట్లాది మంది ఉన్నా.. ఆమె పుట్టుకతోనే యావత్ దేశం ఆమె వంక ఒకసారిగా చూసింది. అంతేనా.. అప్పట్లో మీడియా మొత్తం ఆమె గురించి మాట్లాడింది. ఆమె ఫోటోను ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేశారు. ఇక.. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మొదలు అధికారుల వరకు ఆ చిన్నారికి స్పెషల్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. అంతటి గౌరవ మర్యాదలకు కారణం.. ఆమె భారతావని శతకోటి చిన్నారి కావటమే.

2000 మే 11న ఉదయం ఐదు గంటలకు ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ఆసుపత్రిలో పుట్టిన చిన్నారిని కాసేపటికే.. భారత్ బిలియన్త్ బేబీగా ప్రకటించారు. అంతే.. ఆ వెంటనే ఆ చిట్టి పొట్టి చిన్నారి సెలబ్రిటీగా మారింది. ఆసుపత్రి మొత్తం కోలాహలంగా మారింది. తన కుమార్తె పుట్టిన రోజు జరిగిన హడావుడి గురించి ఆ తండ్రి చెప్పిన మాటల్ని వింటే.. అప్పట్లో ఏం జరిగిందో అర్థమవుతుంది.

‘‘నా భార్య లేబర్ గదిలో నొప్పులు పడుతోంది. అలా టీ తాగుదామని వెళ్లాను. నేను వచ్చేసరికి నా భార్యకు డెలివరీ అయ్యింది. నా బిడ్డను బిలియన్త్ బేబీగా ప్రకటించారు. అదంటే ఏమిటో అప్పట్లో నాకు తెలీదు. కానీ.. క్షణాల్లో పరిస్థితులు మారిపోయాయి. నా భార్య గదిని మార్చేశారు. సెక్యూరిటీ సిబ్బంది వచ్చారు. వీఐపీల నుంచి నర్సుల వరకు ప్రతి ఒక్కరు నా బిడ్డతో ఫోటోలు దిగారు. అప్పట్లో అందరి చూపు మా మీదే ఉండేది’’ అంటూ చెప్పుకొచ్చారు అశోక్. అతను ఒక కిరాణా షాపులో పని చేస్తున్న వేళలో ఆస్థా పుట్టింది. అతడి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న రాజకీయ నాయకులు చాలానే హామీలు ఇచ్చారు.

చిన్నారికి ఉచిత విద్యను అందిస్తామని కూడా చెప్పారు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ కింద రూ.2 లక్షలు అందాయని.. ఆ డబ్బులే ఆస్థా చదువుకు కాస్తంత ఉపయోగపడ్డాయని చెప్పారు. కొన్నాళ్లకు ఆస్థాకు ఆరోగ్య సమస్య తలెత్తితే.. ఆమె పుట్టిన సఫ్దర్ గంజ్ ఆసుపత్రికి తీసుకెళితే.. ఎలాంటి రాయితీ ఇవ్వలేదని పేర్కొన్నారు. తన భార్య బ్యూటీ పార్లర్ లో పని చేస్తుందని.. ఆస్థా.. ఆమె సోదరుడు వారికి వారే కష్టపడ్డారని చెప్పారు.

రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలతో తమ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని మురిసిన వారికి తీవ్ర నిరాశే మిగిలింది. చిన్నతనంలో సెలబ్రిటీ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఆస్థాకు.. తక్కువ సమయంలోనే ఇంటి ఆర్థిక పరిస్థితి అర్థమైంది. డబ్బులు పెట్టి పిల్లల్ని చదివించే స్థోమత కుటుంబానికి లేకపోవటంతో.. ఆమె ప్రభుత్వ పాఠశాలలో చదవాల్సి వచ్చిందని.. డాక్టర్ కావాల్సిన ఆమె నర్సు అయ్యిందని ఆమె తండ్రి చెప్పారు.

మొదట్లో తన పరిస్థితికి ఆమె చిన్నబుచ్చుకున్నా.. ఆ తర్వాత తన ముందున్న అవకాశాల్ని సద్వినియోగం చేసుకుందని.. దాని ఫలితంగానే నర్సింగ్ పూర్తి చేసిన ఆమె.. మిలిటరీ నర్సింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణత సాధించింది. ఇప్పుడు ఆర్మీలో నర్సింగ్ లెఫ్టినెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నట్లు చెబుతున్నారు. పిల్లలకు ట్యూషన్లు చెబుతూ.. ప్రైవేటు ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తూ తన కలను నెరవేర్చుకుందని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆస్థా సోదరుడు మయాంక్ ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. వారిద్దరు కలిసి ఇప్పుడు తమ సొంతింటి కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఒకరి మీద ఆధారపడకుండా స్వయంశక్తితో తన కాళ్ల మీద నిలబడిన ఆస్థాకు మరింత మేలు జరగాలని ఆశిద్దాం.

Tags:    

Similar News