తెలంగాణలో హోం మంత్రి లేకుండానే 11 నెలలుగా ప్రజా పాలన
ఇక ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో 11 నెలలుగా ఈ శాఖకు ప్రత్యేకించి మంత్రి లేరు. ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 11 నెలలు. రేవంత్ రెడ్డి సారథ్యంలో సర్కారు మరొక్క నెల అయితే ఏడాది పూర్తి చేసుకుంటుంది. అయితే, ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం పాలనా తీరు. దాదాపు పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో మంత్రివర్గానికి స్వేచ్ఛ లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ సర్కారు వచ్చాక అలాంటి అపవాదు లేకున్నా.. కీలక శాఖలకు మంత్రులు లేకపోవడం చర్చకు వస్తోంది. తెలంగాణ మంత్రివర్గంలో 12 మంది ఉన్నారు. మరో ఆరుగురిని తీసుకునే అవకాశం ఉంది. అయితే, అది ఎపుడు? అనేదే తెలియడం లేదు.
కార్తీకమూ వచ్చేసింది.
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడం లేదు. వాస్తవానికి టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ గౌడ్ నియామకం సందర్భంగానే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని హడావుడి జరిగింది. కానీ, రెండు నెలల కిందటే మహేశ్ గౌడ్ కు పార్టీ పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రివర్గ విస్తరణకు మాత్రం పచ్చజెండా ఊపలేదు. ఆషాఢ మాసం వెళ్లిపోగానే కొత్త మంత్రులు వస్తారని ఓ దశలో ఊహాగానాలు వినిపించాయి. కానీ, శ్రావణ మాసం పోయి మధ్యలో మరికొన్ని మాసాలూ కరిగిపోయి కార్తీక మాసం వచ్చింది. మంత్రివర్గం మాత్రం విస్తరణ జరగలేదు.
హోం మంత్రి ఎప్పుడు? ఎవరు?
రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత కీలకం హోం మంత్రి. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వంలో నంబర్ 2. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలో దేవేందర్ గౌడ్, వైఎస్ సర్కారులో జానారెడ్డి పోషించిన కీలక పాత్ర గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో విడతలో మహమూద్ అలీ హోం మంత్రి బాధ్యతలు పోషించినా.. ఆయన ముద్ర పెద్దగా లేదు. ఇక ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో 11 నెలలుగా ఈ శాఖకు ప్రత్యేకించి మంత్రి లేరు. ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తున్నారు.
ఆ 4 జిల్లాల వారిలో ఎవరికో?
తెలంగాణ మంత్రివర్గంలో 4 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. అత్యంత కీలకమైన హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మంత్రులెవరూ లేరు. మిగిలిన ఆరు ఖాళీల్లో వీటికి చోటు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈ జిల్లాల నుంచి వచ్చేవారికే హోం మంత్రి పదవి ఇస్తారా? ఉన్న మంత్రులలో ఒకరికి ఈ బాధ్యతలు అప్పగిస్తారా? అనేది చూడాలి.
మహిళా హోం మంత్రేనా?
కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ హోం మంత్రిత్వ బాధ్యతలు సీతక్కకు అప్పగిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, అసలు విస్తరణే జరగనుందున ఎవరికీ దక్కలేదు. మరి త్వరలో ఖాళీలను భర్తీ చేస్తే గనుక సీతక్కనే హోం మంత్రి చేస్తారా? లేక వేరేవారిని మంత్రిని చేస్తారా? అనేది చూడాలి.