కొత్త గవర్నర్లు...ఏపీ నుంచి రాజ్ భవన్ కి వెళ్లేది వారేనా ?

గవర్నర్లుగా అయితే టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు అలాగే సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు పేర్లు వినిపిస్తున్నాయి.

Update: 2024-10-19 03:30 GMT

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా గవర్నర్లను వివిధ రాష్ట్రాలకు నియమించాలని చూస్తోంది. ఇప్పటికే చాలా కాలంగా ఒకే చోట కొనసాగుతున్న వారిని వేరొక చోటకు బదిలీ చేయడం అలాగే కొందరిని వేరే పోస్టింగులు ఇచ్చి ఆయా చోట్ల కొత్త వారికి చాన్స్ ఇవ్వడం మరి కొన్ని కీలకమైన రాష్ట్రాలలో కూడా నియామకాలు జరపడం అన్నది అజెండాగా పెట్టుకుంది.

దేశంలో కీలకమైన రాష్ట్రాలకు సమయం చూసి కొత్త గవర్నర్లను రాజ్ భవన్ కి పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే నవంబర్ లో కొత్త గవర్నర్ల నియామకాలు లేదా ఉన్న గవర్నర్ల బదిలీలు ఉంటాయని అంటున్నారు.

దేశంలోని ఉత్తరప్రదేశ్, కేరళలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు అయిన జమ్మూ అండ్ కాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్ లలో ఈ మార్పులు చేర్పులు జరుగుతాయని అంటున్నారు.

ఇక చూస్తే కనుక జమ్మూ అండ్ కాశ్మీర్ లో కొత్త ప్రభుత్వం తాజాగా అధికారం చేపట్టింది. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న మనోజ్ సిన్హా ని బదిలీ చేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇక ఆయన ప్లేస్ లో ఏపీకి చెందిన వారణాసి రామ్ మాధవ్ ని కొత్త గవర్నర్ గా పంపిస్తారు అని అంటున్నారు

ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి వచ్చి జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించి ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వేళ ఆ పార్టీ కోసం ఎన్నో వ్యూహాలు రచించి జమ్మూలో బీజేపీకి 29 సీట్లను సాధించే ప్రయత్నంలో తన వంతు పాత్ర రామ్ మాధవ్ పోషించారు. ఆయనకు జమ్మూ అండ్ కాశ్మీర్ మీద పూర్తి అవగాహన ఉంది.

దాంతో ఆయనకే లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. అలాగే కేరళ గవర్నర్ గా అరిఫ్ మహమ్మద్ ఖాన్ అయిదేళ్ళకు పైగా పనిచేస్తున్నారు. ఆయనను ఆయనకు వేరే పదవిని ఇచ్చి ఆ రాష్ట్రంలో గవర్నర్ కొత్త వారిని తీసుకుని రావాలని చూస్తున్నారు అలాగే అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషీ పదవీ విరమణ చేస్తారు అని అంటున్నారు. దాంతో అక్కడ కొత్త గవర్నర్ ని నియమిస్తారు అని చెబుతున్నారు.

అదే విధంగా చూస్తే మూడున్నరేళ్లకు పైగా గవర్నర్లుగా పదవీ కాలం పూర్తి చేసుకున్న వారి జాబితాలో హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగు భాయ్ సీ పటేల్, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ వంటి వారు ఉన్నారు. ఇక ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ప్రస్తుతం ఉన్న ఆనంద్ అనందీబెన్ పటేల్ అయిదేళ్ల పదవీకాలం పూర్తి చేశారు. తమిళనాడు గవర్నర్ రవి, గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ మూడేళ్లకు పైగా ఆ పదవీకాలం పూర్తి చేశారు.

ఇక లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయని సీనియర్ నేతలను అలాగే పార్టీ కోసం పనిచేసిన వారిని కొత్త గవర్నర్లుగా నియమించే నియమించే అవకాశం ఉందని అంటున్నారు. కనీసంగా పది మంది దాకా గవర్నర్ పోస్టులుకు నియామకాలు జరుగుతాయని తెలుస్తోంది.

ఇందులో ఏపీ నుంచి మిత్ర పక్షాల కోటాలో ఎవరికి దక్కుతుంది అన్నది చర్చగా ఉంది. గవర్నర్లుగా అయితే టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు అలాగే సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరికీ వీలుంటే ఇవ్వమని కేంద్రాన్ని టీడీపీ కోరవచ్చు. అలా వీలు కాకపోతే ఒకరికి గవర్నర్ పోస్ట్ దక్కవచ్చు. ఆ ఒక్కరూ ఎవరు అన్నది చూడాల్సి ఉంది.

అయితే బీజేపీ తరఫున మాత్రం రామ్ మాధవ్ పేరు ఏపీ నుంచి వినిపిస్తోంది. ఆయనకు మేధావిగా రాజ్యాంగ నిపుణుడిగా ఎంతో పేరు ఉంది. ఆయనకు కచ్చితంగా చాన్స్ ఇస్తారని చెబుతున్నారు. సో ఏపీ నుంచి ఎవరు కొత్త గవర్నర్ల్ అన్నది తొందరలోనే తేలిపోతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News