ఈ బడా మహిళా నేతల్లో గెలిచేదెవరు?
దీంతో అభ్యర్థులు విజయమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇంకా ఎన్నికలకు 40 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. దీంతో అభ్యర్థులు విజయమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
ఇందులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇక్కడ ఇద్దరు మహిళా నేతలు నువ్వా.. నేనా అనేరీతిలో ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నారు. వైసీపీ తరఫున వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి రంగంలోకి దిగారు.
అటు రజిని, ఇటు మాధవి ఇద్దరూ బీసీ అభ్యర్థులే. రజిని ముదిరాజ్ సామాజికవర్గానికి చెందినవారు కాగా, మాధవి రజక సామాజికవర్గానికి చెందినవారు. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. అలాగే ఇద్దరికీ సొంతంగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. మాధవికి రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఆర్థికంగానూ ఒకరికి ఒకరికి తీసిపోరు. అలాగే ఇద్దరూ మూడు పదుల వయసువారే. దీంతో ఈ ఇద్దరు మహిళా నేతల పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
2019లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి తొలిసారి విడదల రజిని పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఘనవిజయం సాధించారు. అంతేకాకుండా వైఎస్ జగన్ రెండో విడత కేబినెట్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా రజిని కీలక బాధ్యతలను చేపట్టారు.
అయితే వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు లేవని ఐప్యాక్ టీమ్ సూచించడంతో ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారని టాక్ నడుస్తోంది. గతంలో ‘మీరు నెలకొల్పిన ఐటీ టవర్స్ లో నాటిన మొక్కను సార్ నేను’ అంటూ చంద్రబాబును పొగిడిన రజిని వైసీపీలో చేరాక తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆమెను ఎలాగైనా ఓడించాలని టీడీపీ పట్టుదలతో ఉందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే గుంటూరు పశ్చిమ సీటును ఆలపాటి రాజా, ఉయ్యూరు శ్రీనివాస్, ఇంకా తదితరులు ఆశించినా రజినికి దీటైన అభ్యర్థిని పెట్టాలని చివరకు చంద్రబాబు.. పిడుగురాళ్ల మాధవికి సీటు ఇచ్చారు. దీంతో గెలుపు కోసం ఈ ఇద్దరు మహిళా నేతలు ఢీ అంటే ఢీ అనేరీతిలో తలపడుతున్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.