స్పీకర్ పదవి వదులుకుంటానంటూ అయ్యన్న ఆగ్రహం
దాంతో ఆయన స్పీకర్ పదవిని అయినా వదులుకుంటాను కానీ అంటూ చాలానే మాట్లాడేశారు.
ఆయన ఫైర్ బ్రాండ్. కానీ స్పీకర్ కాగానే చాలా వరకూ సంయమనం అలవాటు చేసుకున్నారు. అలాగే ఉంటున్నారు. కానీ అపుడపుడు ఆయనలో అసలైన కోణం బయటకు వస్తోంది. ఆయనే ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నానికి చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఆయనకు మరోసారి కోపం వచ్చింది. అది పెను ఆగ్రహం అయింది. దాంతో ఆయన స్పీకర్ పదవిని అయినా వదులుకుంటాను కానీ అంటూ చాలానే మాట్లాడేశారు.
ఇంతకీ ఏమి జరిగింది స్పీకర్ అయ్యన్నకు ఎందుకు కోపం వచ్చింది అన్నది చూస్తే కనుక చాలానే ఉంది. నర్శీపట్నం పరిధిలోని కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ స్థలంలో సుమారుగా 7500 గజాలను ఒక ప్రైవేట్ పార్టీకి ఇచ్చేశారు.
దాంతో వారు అక్కడ నిర్మాణాలకు సిద్ధపడుతున్నారు. విషయం తెలుసుకున్న అయ్యన్న సంబంధిత స్థలానికి వచ్చి తనిఖీ చేశారు. ఆ వెంటనే ఆర్టీసీ అధికారుల మీద మండిపడ్డారు. నర్శీపట్నం ఆర్టీసీకు ఎంతో భూమి ఉందని అదంతా ప్రజల కోసం ప్రజోపయోగమైన పనుల కోసం వాడాల్సిందే అని అయ్యన్న స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ఆర్టీసీని విస్తరించేందుకు ఆ భూమిని వాడుకోవాలి తప్పించి ప్రైవేటు వ్యక్తులకు ఎలా ఇస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో తాను ఎప్పటినుంచో పోరాడుతున్నానని అన్నారు. ఎంతకైనా వెళ్తాను అని హెచ్చరించారు. అవసరం అయితే తన స్పీకర్ పదవిని సైతం వదులుకుంటాను అని అయ్యన్న ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు.
ప్రభుత్వానికి దీని మీద తెలియచేస్తాను అని కూడా అన్నారు. అయ్యన్న ఫైర్ బ్రాండ్ అని తెలిసి ఆయనను స్పీకర్ గా చేశారు. అయితే మాత్రం ఆయన ప్రజల సమస్యల విషయంలో నోరు పెంచుతాను అనే అంటున్నారు. ఆ విషయంలో అడ్డం వస్తే తన పదవిని సైతం వదులుకుంటాను అని కూడా అంటున్నారు.
దీంతో ఈ విషయం రాజకీయంగా హైలెట్ అవుతోంది. అయ్యన స్పీకర్ నియమితులు అయి గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు. ఇంతలోనే ఆయన స్పీకర్ పదవిని వదులుకుంటాను అని అంటున్నారు. ఆయన ప్రజా సమస్యల కోసం అని చెబుతున్నా నిజంగా ఆయనకు ఆ పదవి చేతులు కట్టేసినట్లుగా ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. అయ్యన్న ఇదే విషయం కూడా ఇటీవల కాలంలో చెబుతూ వచ్చారు.
తాను ఇపుడు ఏమి మాట్లాడాలీ అన్నా స్పీకర్ పదవి అడ్డు వస్తోందని కూడా అంటూ చలోక్తులు విసిరేవారు. కానీ నిజంగా ఆయనకు మంత్రి పదవి కాకుండా స్పీకర్ గా నియమించడం వల్ల ఇబ్బంది పడుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా అయ్యన ఫైర్ బ్రాండ్. మరో వైపు ఖాళీ స్థలాలను లీజ్ కి ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఆర్టీసీ చూస్తోంది.
ఇది చాలా కాలంగా వస్తోంది. మరి నర్శీపట్నంలో అయితే అలాంటివి కుదరనీయను అని అయ్యన్న అంటున్నారు. ఇది ప్రభుత్వ పాలసీ అయితే ఆయన ఏ మేరకు అడ్డుకోగలరు అన్నది కూడా చర్చగా ఉంది. అలా జరగని పక్షంలో తన పదవిని వదులుకుంటాను అని అయ్యన్న చెబుతున్న మాటలను కూడా సీరియస్ గానే తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. మొత్తానికి చాలా కాలానికి అయ్యన్నలోని ఫైర్ బ్రాండ్ బయటకు వచ్చారు. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.