నా భర్తకు నా కంటే ఆ పిల్లి ఎక్కువ ఇష్టం.. అందుకే వేధింపుల కేసు
తమ పెంపుడు జంతువు పట్ల ఎక్కువ ప్రేమను చూపిస్తూ.. తనను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటూ ఒక భార్య.. భర్త మీద వేధింపుల కేసు వేసిన వైనం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది.
కొన్ని ఉదంతాల గురించి విన్నంతనే.. ఇలా కూడా జరుగుతుందా? ఇలా కూడా ఆలోచిస్తారా? అన్న భావన కలగటమే కాదు.. సదరు ఉదంతం షాక్ కు గురి చేస్తుంది. తమ పెంపుడు జంతువు పట్ల ఎక్కువ ప్రేమను చూపిస్తూ.. తనను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటూ ఒక భార్య.. భర్త మీద వేధింపుల కేసు వేసిన వైనం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. ఈ వేధింపుల కేసు కోర్టు విచారణకు రావటం.. సదరు భర్త నెత్తి నోరు కొట్టుకొంటూ తన వాదనను వినిపించిన నేపథ్యంలో కోర్టు స్టే విధిస్తూ అతడికి ఉపశమనం కలిగిస్తూ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..
బెంగళూరుకు చెందిన ఒక ఇల్లాలు తన భర్త మీద కేసు పెట్టింది. ఇంట్లో తన భర్త తన కంటే కూడా తాము పెంచుకునే పిల్లి అంటేనే ఎక్కువ ఇష్టమని.. దాన్ని పట్టించుకొని.. తనను నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. తనను నిర్లక్ష్యం చేయటం కూడా వేధింపుల కిందకే వస్తుందన్న వాదనను తెర మీదకు తెచ్చిన ఆమె.. భర్త మీదే కాదు.. వారి తల్లిదండ్రుల మీద కూడా 498ఎ సెక్షన్ కింద కేసు పెట్టింది.
దీంతో.. సదరు భర్త షాక్ తిన్నాడు. వెంటనే కోర్టును ఆశ్రయించాడు. తన భార్య పెట్టిన కేసును రద్దు చేయాలని కోరాడు. పెంపుడు జంతువుపై ప్రేమను చూపించటం క్రౌర్యం ఎలా అవుతుందని ప్రశ్నించిన సదరు భర్త.. తనపైనా.. తన తల్లిదండ్రుల పైనా పెట్టిన కేసును రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ పెట్టుకున్నాడు. దీన్ని విచారించిన న్యాయస్థానం కేసు పెట్టిన భార్యకు నోటీసులు జారీ చేశారు. ఈ ఉదంతం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఔరా.. ఇలాంటి ఇల్లాలు కూడా ఉంటారా? అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.