తాగి వేధించే భర్తను కర్రతో చితక్కొట్టి.. తాడుతో ఉరి
బాపట్ల జిల్లా అడవుల దీవి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త పాలేనికి చెందిన అరుణతో గోకర్ణమఠం గ్రామానికి చెందిన అమరేంద్రబాబుకు పదేళ్ల క్రితం పెళ్లైంది.
చిత్రహింసలు పెట్టే భర్త అరాచకాల్ని తట్టుకోలేకపోయింది. చాకు జేబులో పెట్టుకొచ్చి చంపేస్తానంటూ బెదిరించే భర్త తీరుకు విసిగిపోయిన భార్య.. కర్రతో చితక్కొట్టటమే కాదు.. తాడుతో మెడకు తగిలించి.. రోడ్డు మీదకు లాక్కొచ్చిన వేళలో.. ఉరిలా బిగుసుకుపోయి మరణించిన భర్త ఉదంతం బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. భర్తకు ఉరి వేసి.. వీధుల్లోకి ఈడ్చుకొచ్చి.. చంపిన సమయంలో తీసిన వీడియో వెలుగు చూడటం.. అది కాస్తా వైరల్ గా కావటంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పెద్ద ఎత్తున వైరల్ అయిన షాకింగ్ ఘటనలోకి వెళితే..
బాపట్ల జిల్లా అడవుల దీవి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త పాలేనికి చెందిన అరుణతో గోకర్ణమఠం గ్రామానికి చెందిన అమరేంద్రబాబుకు పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఒక కొడుకు.. కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసైన అమరేంద్ర.. నిత్యం భార్యను వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో కుటుంబ పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయితీలు జరిగినా అతడిలో మార్పురాలేదు. పంచాయితీలు జరిగిన తర్వాత నుంచి వేధింపులు మరింత పెరిగాయి.
ఇదిలా ఉండగా డిసెంబరు 31న వీరిద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఏళ్లకు ఏళ్లు ఓపిక పడుతూ.. భర్త వేధింపులను భరిస్తూ వస్తున్న అరుణ.. భరించలేని కోపానికి గురైంది. కత్తిని పట్టుకొని.. ఆమెను చంపేస్తానంటూ బెదిరించటంపై విసుగు చెందిన ఆమె.. భర్తపై కర్రతోతీవ్రంగా దాడి చేసింది. ఆ తర్వత అతని మెడకు తాడు తగిలించి.. నడిరోడ్డుపైకి లాక్కొచ్చింది. ఈ క్రమంలో మెడకు ఉరి పడింది. దీనికి తోడు.. అమరేంద్ర మెడపై కాలు అదిమి పట్టి ఉంచిన వీడియో వైరల్ గా మారింది. తొలుత భర్తను చంపిన అరుణపై పెట్టిన సెక్షన్లకు అదనంగా ఇప్పుడు మరిన్ని సెక్షన్లు చేర్చాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి కారణం.. ఆమె భర్తను చంపిన వీడియో వైరల్ కావటంతో..పోలీసులు కేసు విషయంలో పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.