వరదలా కాదు...ఏపీకి విదిలించిన కేంద్రం
దాని కంటే ముందు తక్షణ సాయంగా కూడా బాగానే ఇచ్చి ఆదుకుంటారు అని తలచారు.
ఏపీ ఆగస్టు నెలలో వచ్చిన వరదలకు కనీ వినీ ఎరగని విధంగా అతలాకుతలం అయింది. దీంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపధ్యంలో కేంద్రం నుంచి భారీ ఆర్థిక సాయన్నే ఆశించింది. ఏడు వేల కోట్ల రూపాయలు ప్రాథమిక సాయంగా ఏపీ పేర్కొంటూ కేంద్రానికి నివేదించింది. వరదల నేపథ్యంలో వెంటనే కేంద్ర బృందాలు ఏపీకి రావడం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా విజిట్ చేయడంతో ఏపీకి పెద్ద ఎత్తున సాయం దక్కుతుందని అంతా ఆశించారు.
దాని కంటే ముందు తక్షణ సాయంగా కూడా బాగానే ఇచ్చి ఆదుకుంటారు అని తలచారు. కానీ వరదలు వచ్చి వెళ్లిపోయిన నెల తర్వాత కేంద్రం సాయం చేసింది. అయితే ఇది వరదలా సాయం కాదు కేవలం విదిలింపు గానే ఉంది అని విమర్శలు వినిపిస్తున్నాయి.
దేశంలో గత కొద్ది కాలంగా వచ్చి పడిన వరదలకు ఏకంగా పద్నాలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. దాంతో కేంద్రం అన్ని రాష్ట్రాలకు కలిపి ఏకంగా 5,858.60 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో ఏపీకి దక్కింది ఎంత అంటే 1036 కోట్ల రూపాయల నిధులు మాత్రమే. ఏపీ ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలు సాయం ఇవ్వాలని కోరితే వచ్చినది వేయి కోట్ల రూపాయలు అని అంటున్నారు. ఇక కేంద్ర సాయం కంటే ముందే ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలను సాయంగా అందించారు. దాంతో చాలా వరకూ సహాయం అయితే సాగుతోంది
అయితే ఏపీలో పూర్తిగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో కేంద్రం కనీసంగా నాలుగైదు వేల కోట్లు అయినా ఇస్తుంది అనుకుంటే వేయి కోట్ల రూపాయలకే పరిమితం చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. మరో వైపు చూస్తే తెలంగాణా పది వేల కోట్ల రూపాయల వరద సాయాన్ని కేంద్రం నుంచి కోరింది.
అయితే తెలంగాణాకు మరీ తక్కువగా 416.80 కోట్లు విడుదల చేశారు.అయితే ఈ మొత్తం 14 రాష్ట్రాలలో మహారాష్ట్రాకే ఎక్కువ నిధులు దక్కాయని అంటున్నారు. ఎందుకు అంటే మహారాష్ట్రకు తొందర్లో ఎన్నికలు ఉన్నందువల్లనే ఈ నిధులు బాగా ఇచ్చారు అని అంటున్నారు మహారాష్ట్రాకు 1432 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు.
మొత్తం మీద చూస్తే ఏపీ నుంచి టీడీపీ జనసేన బీజేపీ ఎంపీలు 21 మంది ఉన్నారు. వీరి మద్దతే కేంద్రానికి కీలకంగా ఉంది. అలాంటిది ఇంత పెద్ద విపత్తు వస్తే కేంద్రం భారీగా సాయం చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ విదిలింపులతో సరిపెట్టడం పట్ల మాత్రం అంతటా చర్చ సాగుతోంది. మరి దీని మీద టీడీపీ కూటమి మిత్రులు ఏ విధంగా ఒత్తిడి తెచ్చి మరిన్ని నిధులు సాధిస్తారో చూడాల్సి ఉంది.