హైడ్రా 262 నాటౌట్.. ప్రాంతాల వారీగా స్కోర్ షీట్ ఇదిగో.

చెరువులు, ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర నుంచి విడిపించేందుకు ఏర్పాటైన ఈ సంస్థ తన దూకుడు చూపుతోంది.

Update: 2024-09-11 11:57 GMT

కేవలం రెండు నెలలు.. 111 ఎకరాల స్వాధీనం.. 262 అక్రమ నిర్మాణాలు నేలమట్టం.. ఇంకా కొనసాగుతున్న బ్యాటింగ్.. ఇదీ హైదరాబాద్ లో హైడ్రా హల్ చల్. చెరువులు, ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర నుంచి విడిపించేందుకు ఏర్పాటైన ఈ సంస్థ తన దూకుడు చూపుతోంది. తాజాగా తన పనితీరుపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న ఈ సంస్థ నిబంధనలను పాటించకుంటే ఏమాత్రం ఉపేక్షించడం లేదు.

అత్యధికం అమీన్ పూర్..

హైడ్రా నివేదించి ప్రకారం చూస్తే సికింద్రాబాద్ రాంనగర్‌ మణెమ్మ గల్లీలో 3, గగన్‌ పహాడ్‌ అప్పా చెరువులో 14, అమీన్‌ పూర్‌ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్‌ సున్నం చెరువులో 42, దుండిగల్‌ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించింది. అత్యధికంగా అమీన్‌ పూర్‌లో 51, మాదాపూర్‌ సున్నం చెరువులో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. కాగా, ఐపీఎస్‌ అధికారి, డీఐజీ ర్యాంకుల్లో ఉన్న ఏవీ రంగనాథ్‌ హైడ్రా కమిషనర్‌ గా వ్యవహరిస్తుండగా.. మంగళవారం దానికి 15 మంది సీఐలు, 8 మంది ఎస్‌ఐలను కేటాయించింది. త్వరలో పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనుంది. ఈ టీమ్ ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు.

ఈ 111 ఎకరాలలో..

ఇప్పుడు హైదరాబాద్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం ఏదంటే.. హైడ్రానే. ఎందుకంటే అక్కినేని నాగార్జున వంటి సినీ హీరోకు చెందిన కన్వెన్షన్ నే ఒక్కసారిగా నేలమట్టం చేసింది. ఇంకా పలు ప్రముఖ నిర్మాణ సంస్థలకూ నోటీసులిచ్చింది. హెచ్చరికలు చేసినా నిర్మాణాలు చేస్తున్న వాటినీ కూల్చివేస్తోంది. ఇలా కూల్చివేసిన మొత్త నిర్మణాలు 262 కావడం గమనార్హం. ఇక ఎకరం వంద కోట్లు దాటి పలుకుతున్న హైదరాబాద్ లో

111 ఎకరాలను స్వాధీనం చేసుకోవడం అంటే మాటలు కాదు.

ఆక్రమణలు వదిలి తప్పుకొంటే గౌరవం..

ఆక్రమణలను క్రమబద్ధీకరణ చేసేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఆక్రమణలతో వరదలు ఉప్పెనలా మారి పేదల ఇళ్లను ముంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించడమే హైడ్రా లక్ష్యంగా స్పష్టం చేశారు. అంతేకాదు.. ఆక్రమణలను వదిలి గౌరవంగా తప్పుకోవాలని కూడా సూచించారు. కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా కోర్టుల్లో కొట్లాడుతామని రేవంత్ స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు ఉన్నాయని చెప్పారు.

Tags:    

Similar News