జేసీ ఫ్రస్ట్రేషన్...అస్మిత్ కి ట్రబుల్ ?

మీడియా ముందు తనకు తోచింది కరెక్ట్ అనుకున్నది మాట్లాడేస్తారు.

Update: 2025-01-04 02:30 GMT

అనంతపురం జిల్లాలో జేసీ సోదరులది నాలుగైదు దశాబ్దాల చరిత్ర. జేసీ దివాకర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ సమకాలీనుడు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా పనిచేశారు. ఇక జేసీ దివాకర్ రెడ్డి ముక్కుసూటి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తన మనసులో ఏదీ దాచుకోరు. మీడియా ముందు తనకు తోచింది కరెక్ట్ అనుకున్నది మాట్లాడేస్తారు. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి.

ఆయన 2014లో ఒకసారి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హయాంలో ఆయన తాడిపత్రి మున్సిపాలిటీ నుంచి చైర్మన్ గా గెలిచి సత్తా చాటారు. ఇక 2024 లో తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే దివాకర్ రెడ్డి కంటే సూపర్ ఫైర్ బ్రాండ్ ప్రభాకర్ రెడ్డి. ఆయన గతంలో జగన్ మీద వైసీపీ నేతల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇపుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆరేడు నెలలలో కూడా ఆయన తన ఆగ్రహాన్ని తగ్గించుకోవడం లేదు.

సొంత ప్రభుత్వానికి చికాకు కలిగేలా ఆయన వైఖరి ఉందని అంటున్నారు. కడప పరిశ్రమ నుంచి బూడిదను తీసుకునే విషయంలో ఆయనకు కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో పేచీ కాస్తా ఏకంగా బీజేపీ మీదనే రాజకీయ సమరంగా మారింది.

ఇక బీజేపీ మహిళా నాయకురాలు మాధవీలత మీద ఏడున్నర పదుల వయసులో జేసీ ప్రభాకరరెడ్డి తాజాగా చేసిన అనుచిత కామెంట్స్ మాత్రం అంతటా చర్చనీయాంశం అయ్యాయి. ఒక మహిళా నాయకురాలి విషయంలో ఈ విధంగా చేసి మాట్లాడడం, అందునా తమ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నేతల విషయంలో ఆయన ఈ విధంగా వ్యవహరించడం ఇబ్బందిగానే ఉంది.

జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఆదినారాయణ రెడ్డి తో కయ్యానికి కాలు దువ్వడంతో పాటు చేసిన ప్రకటనల మీద టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అనంతపురం జిల్లాకు గత నెలలో వచ్చిన చంద్రబాబు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని పిలిపించుకుని చెప్పల్సిని చెప్పారు అని ప్రచారం సాగింది.

ఇక జేసీ అస్మిత్ రెడ్డి విషయానికి వస్తే ఆయన యువ ఎమ్మెల్యేగా మంచి రాజకీయ భవిష్యత్తు కోరుకుంటున్న నాయకుడు. 2024 ఎన్నికలలో ఆయన విజయానికి అయిదేళ్ళ పాటు జనంలో ఉంటూ ఆయన వేసుకున్న బాటలు ఎంతో కారణం అయ్యాయి. ఆయన చాలా హుందాగా ఉంటారని జనాల సమస్యల మీద కూడా బాగానే రియాక్ట్ అవుతారని కూడా అంటూంటారు

అదె విధంగా చూస్తే జేసీ ఫ్యామిలీకి టోటల్ గా ఆయనే వారసుడు, పెదనాన్న జేసీ దివాకర్ రెడ్డి అరు సార్లు, తన తండ్రి ప్రభాకర్ రెడ్డి ఒకసారి గెలిచిన తాడిపత్రిలో మరిన్ని సార్లు గెలిచి తన సొంత నియోజకవర్గంలో జేసీ మార్క్ రాజకీయాలను ముందుకు తీసుకుని పోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆ దిశగా ఆయనను అన్ని విధాలుగా ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది.

అయితే సొంత తండ్రి జేసీ ప్రభాకరరెడ్డి ఫ్రస్ట్రేషన్ ఆయన దూకుడు రాజకీయం అస్మిత్ రెడ్డి పొలిటికల్ కెరీర్ కి చేటు తెస్తున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. నిజానికి చూస్తే రానున్న కాలంలో అనంతపురం జిల్లా నుంచి మంత్రి అయ్యే అర్హతలు కూడా అస్మిత్ రెడ్డికి నిండుగా ఉన్నాయి. అదే విధంగా తాడిపత్రి టీడీపీ టికెట్ కూడా ఆ కుటుంబాన్ని దాటి పోదు అన్నది కూడా ఉంది.

కానీ ప్రభాకరరెడ్డి నోరా జేసీ రాజకీయానికి చేటు అన్నట్లుగా ఉందని అంటున్నారు. ఇంతకీ జేసీ ప్రభాకరరెడ్డి ఫ్రస్టేషన్ ఎవరి మీద అన్న చర్చ కూడా వస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి తన మాటే చెల్లుబాటు కావాలన్నది జేసీ ప్రభాకరరెడ్డి పంతం అయితే మాత్రం అది ఆ కుటుంబానికే ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు.

రాజకీయ పరిస్థితులు మారిన నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అంతే తప్ప ఊరకే ఆవేశపడితే మాత్రం తన రాజకీయ వారసుడు సొంత కుమారుడి ఫ్యూచర్ కే బ్రేకులు వేస్తున్నానన్న సంగతి ఆయన గ్రహించాల్సి ఉందని అంటున్నారు. ఇక అస్మిత్ రెడ్డి కూడా తన తండ్రి విషయంలో ఆలోచించి కొంతవరకూ నియంత్రణతో ఉండేలా జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ యువనేత కోరి ఇబ్బందులే తెచ్చుకుంటారేమో అని అంటున్నారు.

ఇక బీజేపీ నాయకురాలు మాధవీలత కూడా జేసీ అస్మిత్ రెడ్డి మంచి వారు అయినా తన తండ్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించకపోవడాన్ని ప్రశ్నించారు. అందరూ కూడా అలాగే ఆలోచిస్తారు కాబట్టి అస్మిత్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా సొంత ఆలోచనలు చేయాల్సి ఉందని అంటున్నారు

Tags:    

Similar News