తెలంగాణ స‌హా ఆ రాష్ట్రాల్లో రేపు ప్ర‌త్యేక అసెంబ్లీ.. స‌భ‌కు రానున్న కేసీఆర్‌!

ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఈ ఒక రోజు ప్ర‌త్యేక స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

Update: 2024-12-29 18:30 GMT

తెలంగాణ స‌హా కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో రేపు(సోమ‌వారం) ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌ను న్నాయి. శాస‌న స‌భ‌ల నిబంధ‌నావ‌ళిలోని ఆర్టిక‌ల్ 16 ప్ర‌కారం.. స్పీక‌ర్ల‌కు ఉన్న విచ‌క్ష‌ణాధికారం మేర‌కు సోమ‌వారం ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశానికి సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న జారీ చేశారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఈ ఒక రోజు ప్ర‌త్యేక స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

ఎందుకు?

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మృతికి సంతాపం తెలిపేందుకు ఈ ప్ర‌త్యేక భేటీని ఏర్పాటు చేశారు. పార్టీ అదిష్టానం సూచ‌న‌ల మేర‌కు.. కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల్లో ఈ ప్ర‌త్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పూర్తిస్తాయిలో అధికారంలో ఉంది. జార్ఖండ్‌లో మాత్రం కూట‌మి ప్ర‌భుత్వం ఉంది. అదేవి ధంగా జ‌మ్ము క‌శ్మీర్‌లోనూ కూట‌మిగా ఏర్ప‌డినా.. ప్ర‌భుత్వానికి వెలుప‌లి నుంచి మ‌ద్ద‌తు ఇస్తోంది.

ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో అధికారం చ‌లాయిస్తున్న తెలంగాణ, క‌ర్ణాట‌క‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ల‌లో దివంగ‌త మ‌న్మోహ‌న్‌సింగ్‌కు నివాళుల‌ర్పించి.. సంతాప సూచ‌కంగా స‌భ‌లు తీర్మానం చేయ‌నున్నా యి. ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు సంతాప దినాల‌ను పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలో స‌భ‌లు కూడా.. సంతాప తీర్మానం చేయాల‌ని.. మాజీ ప్ర‌ధానిగా ఈ దేశానికి చేసిన సేవ‌ల‌ను కొనియాడాల‌ని పార్టీ అధిష్టానం ఇచ్చిన సూచ‌న‌ల మేర‌కు.. ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

తెలంగాణ‌లో స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు.. ఇప్ప‌టికే స‌భ్యుల‌కు ఈ మేర‌కు స‌మాచారం పంపించారు. ఈ స‌మావే శాల‌కు కేసీఆర్ హాజ‌రు కానున్నారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న స‌మ‌యంలో మ‌న్మోహ‌న్ ప్ర‌ధానిగా ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో ఇరువురికి మ‌ధ్య ప్ర‌త్యేక అనుబంధం ఉంది. అదేవిధంగా.. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న విష‌యంలోనూ మ‌న్మోహ‌న్ సానుకూలంగా ఉన్న విష‌యాన్ని కేసీఆర్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. ఇటీవ‌ల మ‌న్మోహ‌న్ మృతి చెందిన నేప‌థ్యంలో ఆయ‌న త‌న కుమారుడు మాజీ మంత్రికేటీఆర్‌ను పంపించారు. దీంతో ప్ర‌త్యేకంగా మ‌న్మోహ‌న్ సంతాప తీర్మానం కోసం ఏర్పాటు చేస్తున్న స‌భ‌కు కేసీఆర్ త‌ప్ప‌నిస‌రిగా వ‌స్తార‌ని భావిస్తున్నారు.

Tags:    

Similar News