కేసీఆర్ బయటకు రాకపోవడానికి కారణం అదేనట!
ఇక కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకివ వస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. కవిత వచ్చి కూడా వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు కేసీఆర్ కార్యాచరణపై మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.
కేసీఆర్ దశాబ్ద కాలం పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏలారు. పోయిన ఎన్నికల్లో అనుకోని ఓటమిని చవిచూశారు. దాంతో అప్పటి నుంచి ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇంతవరకు ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చిన దాఖలాలు లేవు. కనీసం ప్రెస్‌మీట్లు పెట్టిన సందర్భాలు లేవు. ఇంతవరకు ఒక్క స్టేట్‌మెంట్ ఇచ్చింది లేదు.
కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తొమ్మిది నెలలు గడిచింది. అయితే.. ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్ తనయుడు కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, ఇతర నేతలు మాత్రమే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు అటాక్ చేస్తున్నారు. అంతేకానీ.. ఇంతవరకు కేసీఆర్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఎలాంటి విమర్శలు వినిపించలేదు.
అయితే.. మొన్నటి వరకు తన కూతురు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉంది. దాంతో ఆమె రిలీజ్ కోసం కేసీఆర్ వెయిట్ చేశారని ప్రచారం జరిగింది. ఇటీవలే ఆమె కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఇక కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకివ వస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. కవిత వచ్చి కూడా వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు కేసీఆర్ కార్యాచరణపై మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.
ఓవైపు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలోనైనా కేసీఆర్ బయటకు వచ్చి ప్రజలకు ధైర్యం ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ.. ఇప్పటికి కూడా ఆయన ప్రజల్లోకి రావడం లేదు. రేపు మాపు అంటూ బీఆర్ఎస్ నేతలు లీకులు ఇస్తున్నా.. అధినేత కేసీఆర్ నుంచి ఆ విషయంపై స్పందన కరువైంది. అటు అధికార పార్టీ నేతలు కూడా అదే ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి ప్రజలను పలకరించకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. సీనియర్ నేతగా ప్రభుత్వానికి కూడా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు కదా అని కోరుతున్నారు. అయినా.. కూడా కేసీఆర్ ఇంతవరకు గ్రౌండ్‌లోకి వచ్చింది లేదు.
ఇప్పుడు కొత్తగా వినాయక చవితి నవరాత్రులు ముగిశాకనే కేసీఆర్ బయటకు వస్తారని ప్రచారం నడుస్తోంది. అయితే.. అందుకూ కారణాలు లేకపోలేదు. ఇటీవల డీఎంకే పార్టీ సంస్థాగత నిర్మాణం, ఆ పార్టీ బలాలను స్టడీ చేసేందుకు బీఆర్ఎస్ బృందం తమిళనాడు వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. అక్కడి వెళ్లొచ్చాక టీమ్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌తో ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారట. అంతకుముందే పార్టీ బలోపేతం.. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీసే అంశంపై నేతలకు దిశానిర్దేశం చేస్తారని టాక్ నడుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. అధికారంలో రావడంతో ఇటీవలే రుణమాఫీ చేశారు. అయితే.. అందులో చాలా మంది రైతులను విస్మరించారనే విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం చెప్పిన లెక్కలకు, వాస్తవాలకు పొంతన లేకుండా పోయిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీనికితోడు రైతు భరోసా ఇంతవరకు ఇవ్వలేదు. అసలు దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ప్రకటించలేదు. దీంతో ఈ రెండు అంశాలను వేదికగా చేసుకొని కేసీఆర్ గ్రౌండ్‌లోకి దిగుతారని తెలుస్తోంది. రైతుల సమస్యలనే అస్త్రాలుగా ఎంచుకొని కాంగ్రెస్‌పై సమరభేరి మోగిస్తారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మునుపటి కేసీఆర్‌ను ప్రజలు మరోసారి చూడబోతున్నారని ధీమాతో అంటున్నారు.