ఆ ఇద్దరిపై వేటు.. నాగబాబు, పల్లాకు చాన్స్!?
దీంతో ఇటీవల మంత్రుల పనితీరుపై మార్కులిచ్చిన సీఎం.. కొందరిని పక్కపెట్టే విషయమై సంకేతాలిచ్చారని చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు పూర్తికావస్తోంది. ప్రభుత్వం లక్ష్యాల మేరకు చకచకా పనులు చేసుకుంటూ పోతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం తన జట్టు పనితీరుపై ఓ కన్నేసి ఉంచారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు తప్పు చేసినా, నిర్లక్ష్యంగా ఉన్నా ముఖం మీదే చెప్పేస్తున్నారు. సరిగా పనిచేయకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటానని ప్రమాణ స్వీకారం రోజే హెచ్చరికలు చేశారు. కానీ, కొందరు మంత్రులు సీఎం స్పీడ్ ను అందుకోలేకపోతున్నారు. దీంతో ఇటీవల మంత్రుల పనితీరుపై మార్కులిచ్చిన సీఎం.. కొందరిని పక్కపెట్టే విషయమై సంకేతాలిచ్చారని చెబుతున్నారు. క్యాబినెట్లోకి కొత్తగా ఒకరిద్దరిని తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో సంక్రాంతికి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారని ప్రచారం ఊపందుకుంది. సంక్రాంతి పండగ కానుకగా ఇద్దరికి క్యాబినెట్ బెర్తు ఇస్తామని హామీ ఇచ్చినట్లు టీడీపీ వర్గాల సమాచారం. మంత్రివర్గంలో ప్రస్తుతం ఖాళీ ఉంది. కానీ, ముఖ్యమంత్రి ఇద్దరికి క్యాబినెట్లో తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎవరిపై వేటు పడుతుందనేది పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంట రేపుతుంది. ప్రస్తుతం 24 మంది మంత్రుల్లో ఒకరిద్దరి పనితీరుపై ముఖ్యమంత్రి పూర్తిగా అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. వీరి స్థానంలో కొత్తవారిని తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం టీడీపీలో మంత్రి పదవులపై చాలా మంది ఆశతో ఉన్నారు. కానీ, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు బాహటంగా ప్రకటించారు. నాగబాబు రాజ్యసభ సభ్యత్వం ఆశించారు. కానీ, ఇటీవల జరిగిన మూడు రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక స్థానాన్ని తీసుకుంది. దీంతో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరిక మేరకు నాగబాబును మంత్రిని చేసేందుకు చంద్రబాబు మాటిచ్చారు. అయితే ప్రస్తుతం నాగబాబు అసెంబ్లీ, మండలిలో సభ్యుడిగా లేరు. దీంతో ఆయనను ముందుగా ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత మంత్రిని చేయాలని అనుకున్నారు. మార్చి వరకు మండలికి ఎన్నికలు జరిగే అవకాశం లేనందున సంక్రాంతికే క్యాబినెట్ విస్తరించి నాగబాబును మంత్రి చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో నాగబాబుతో పాటు మరికొందరికి మంత్రి పదవులివ్వాలనే ప్రతిపాదన టీడీపీ నుంచి వస్తోంది.
ప్రస్తుతం టీడీపీలో చాలా మంది సీనియర్లు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లా నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి జ్యోతుల నెహ్రూ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పితాని సత్యానారాయణ, ఎన్టీఆర్ జిల్లా నుంచి దేవినేని ఉమా, రాయలసీమ నుంచి పరిటాల సునీత తదితరులు మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మంత్రివర్గంలో తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మెరుగైన పనితీరు కనబరుస్తున్న పల్లా, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారు. పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను మంత్రిగా ప్రోత్సహిస్తే మంచి ఫలితం ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారట. దీంతో పల్లాకు లైన్ క్లియర్ అయిందని చెబుతున్నారు. కాగా, నాగబాబుతోపాటు పల్లాను మంత్రి చేయాల్సి వస్తే మంత్రివర్గంలో ఒకరిని రాజీనామా చేయాల్సివుంటుంది. ఆ ఒక్కరు ఎవరు? అనేది టెన్షన్ పుట్టిస్తోంది.
ప్రస్తుత మంత్రుల్లో కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాశ్, ఎస్.సవితమ్మ వంటివారు తొలిసారి గెలిచి మంత్రులయ్యారు. రాయలసీమకు చెందిన బీసీ మహిళ సవితమ్మ మంచి పనితీరు కనబరుస్తున్నట్లు ముఖ్యమంత్రి సర్వేలో తేలింది. ఇక కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాశ్ పనితీరుపై తొలి నుంచి ముఖ్యమంత్రికి సదాభిప్రాయం లేదంటున్నారు. జిల్లాలో ఇతర నేతలను కలుపుకుని వెళ్లడంలో ఆయన విఫలమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బ్యూరోకాట్ మాదిరిగా పనిచేస్తున్నారే కానీ, రాజకీయంగా దూసుకుపోవడం లేదని చెబుతున్నారు. ఆయన జిల్లాలో ఇప్పటికీ వైసీపీ నేత బొత్స హవా కొనసాగుతోందని, దీన్ని కొండపల్లి అడ్డుకోలేకపోతున్నారని పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో సుభాశ్, కొండపల్లి శ్రీనివాస్ బెర్తులకు ఎసరు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. సుభాశ్ స్థానంలో ఆ జిల్లా నుంచి ఎవరికైనా అవకాశం ఇస్తారా? లేక ఇప్పటికే ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అదే జిల్లాకు చెందిన మరో మంత్రి దుర్గేశ్ కు ఆ జిల్లా బాధ్యతలు అప్పగిస్తారా? అనేది చూడాల్సివుంది. కానీ, మంత్రి కొండపల్లిని తప్పిస్తే విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రస్తుతానికి ఒకరిని తప్పించి పల్లాకు చాన్స్ ఇచ్చి కొద్ది రోజుల తర్వాత పూర్తిస్థాయి ప్రక్షాళన చేపట్టి మొత్తం మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారని అంటున్నారు. మొత్తానికి సంక్రాంతి బోనంజాగా నాగబాబు, పల్లా శ్రీనివాసరావులకు మంత్రి యోగం పట్టనుందనే టాక్ అమరావతిలో మంచి రీసౌండ్ ఇస్తోంది.