ఇండియా కూటమిలోకి జగన్ నవీన్ ?
ముందు బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తరువాత ఎన్నికలకు సంబంధించిన రోడ్ మ్యాప్ అంతా రెడీ చేస్తారు అని అంటున్నారు.
మరో రెండున్నరేళ్లలో జమిలి ఎన్నికలు దేశంలో జరగబోతున్నాయని ఢిల్లీలో భారీ ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది. కేంద్ర పార్లమెంటరీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నవంబర్ 25 నుంచి మొదలయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలోనే జమిలి ఎన్నికల బిల్లుని సభ ముందుకు తెస్తామని ప్రకటించారు.
ముందు బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తరువాత ఎన్నికలకు సంబంధించిన రోడ్ మ్యాప్ అంతా రెడీ చేస్తారు అని అంటున్నారు. ఇక దేశంలో ఈసారి ఎన్నికలు రెండు భారీ కూటముల మధ్యనే అని అంటున్నారు. జమిలి ఎన్నికలు అంటే ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఏదో ఒక జాతీయ కూటమిలోకి సర్దుకోవాల్సిందే అని అంటున్నారు.
దాంతో అనేక రకాలైన ఊహాగానాలూ ప్రచారమూ సాగుతోంది. ఎన్డీయే కూటమిలో ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నాయి. తెలుగు రాజకీయాల్లో చూస్తే కనుక ఏపీలో టీడీపీ జనసేన ఎన్డీయేతో కొనసాగుతున్నాయి. 2027లో జమిలి ఎన్నికలు జరిగినా ఈ పార్టీలు అన్నీ కలసి పోటీ చేస్తాయని అంటున్నారు.
దాంతో విపక్షంలోని వైసీపీకి ఎన్డీయేలో చోటు అయితే ఉండదు, 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి భారీగా దెబ్బ తిన్న వైసీపీ ఈసారి ఆ సాహసం చేయదని అంటున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తామని భావించింది. ఒక వేళ ఓడినా ఇంత దారుణమైన ఫలితం ఉంటుందని ఊహించలేదు అని అంటున్నారు. దాంతో తమకు వచ్చిన ఎంపీ సీట్లను చూపించి ఎన్డీయేలో కీలకం కావచ్చు అని భావించి ఉంటారని అంటున్నారు.
అయితే అవన్నీ తప్పు అని రుజువు అయ్యాయి. ఇక ఎన్డీయేలో బలమైన బంధం టీడీపీ జనసేనకు ఉంది. దాంతో వైసీపీ ఈసారి సోలోగా పోటీ చేస్తే తట్టుకోవడం కష్టమన్న భావన పార్టీ లోపలా బయటా కూడా సాగుతోంది. దానికి తోడు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి బలంగా మారుతోంది. ఇక జగన్ కి మిత్రులుగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ వంటి వారు ఉన్నారు. ఈ కారణంగా జగన్ ఇండియా కూటమి వైపు రావచ్చు అని ప్రచారంలో ఉంది.
అయితే అది ఇప్పట్లో ప్రకటించరని ఎన్నికలు దగ్గర చేసి ఇండియా కూటమిలోకి వైసీపీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఈవీఎంలే కారణం అన్నట్లుగా జగన్ ఆ పార్టీకి మద్దతుగా చేసిన ట్వీట్ తో ఆయన ఇండియా కూటమి వైపు ఉన్నారని అంటున్నారు.
అంతే కాదు కేంద్రం ప్రవేశపెట్టబోయే వక్ఫ్ బిల్లుకు కూడా వైసీపీ మద్దతు ఇవ్వదని చెప్పి ఇండియా కూటమి రూట్ ని ఆయన తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. సో జగన్ ఇండియా కూటమికి దగ్గరగా జరుగుతున్నారని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఒడిషాలో కీలక నాయకుడు బిజూ జనతాదళ్ అధినేత మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఎన్డీయేకు పూర్తిగా దూరం జరిగారు. ఆయనను 2024 ఎన్నికల్లో బీజేపీ ఓడించింది. అక్కడ ఈవీఎంల మీద బిజూ జనతాదళ్ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. తమకు ఉన్న తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల మద్దతు కూడా బీజేపీకి ఇవ్వమని నవీన్ పట్నాయక్ తెగేసి చెబుతున్నారు.
ఆయన ఇండియా కూటమితోనే ఉంటారని తెలుస్తోంది. ఇప్పటిదాకా నవీన్ న్యూట్రల్ పాలిటిక్స్ ని నడిపారు. కానీ జమిలి ఎన్నికలు వస్తే మాత్రం ఆయన ఇండియా కూటమికే జై కొడతారు అని అంటున్నారు. ఇలా రెండు కీలకమైన ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమి వైపుగా వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.