సోము విష్ణు మాధవ్...బీజేపీలో ఎవరికి చాన్స్ ?

అసెంబ్లీలో టీడీపీ కూటమికి ఉన్న బలాలను బట్టి చూస్తే కనుక కచ్చితంగా ఐదు సీట్లూ కూటమికే వశం అవుతాయన్నది వేరేగా చెప్పాల్సింది లేదు.;

Update: 2025-03-04 20:30 GMT

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ముచ్చట మొదలైంది. పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాయి. టీడీపీ రెండు స్థానాలలో బంపర్ మెజారిటీని సాధించింది. దాంతో టీడీపీ కూటమి చూపు ఇపుడు ఎమ్మెల్యే కోటాలో జరిగే అయిదు ఎమ్మెల్సీ ఎన్నికల మీద పడింది. అసెంబ్లీలో టీడీపీ కూటమికి ఉన్న బలాలను బట్టి చూస్తే కనుక కచ్చితంగా ఐదు సీట్లూ కూటమికే వశం అవుతాయన్నది వేరేగా చెప్పాల్సింది లేదు.

దీంతో ఈ అయిదింటిలో ఒకదానికి జనసేనకు ఇస్తున్నారు. మరో సీటు విషయంలో బీజేపీ నుంచి రాయబారాలు సాగుతున్నాయని అంటున్నారు. బీజేపీకి శాసనమండలిలో ఒక్క సభ్యుడూ లేరన్నది కూటమి పెద్దల దృష్టికి తెస్తున్నారు. ఈ సీటు కేటాయించాల్సిందే అన్నది ఒత్తిడిగా ఉంది. అలా చేసినా టీడీపీకి మూడు ఎమ్మెల్సీ సీట్లు ఉంటాయి. మిత్రులకు న్యాయం చేసినట్లు అవుతుంది.

గతంలో కూడా రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే టీడీపీ జనసేన చెరొకటి తీసుకున్నాయి. అపుడు బీజేపీకి ఏమీ ఇవ్వలేదు. నామినేటెడ్ పదవులలో బీజేపీకి పెద్దగా నంబర్ దక్కింది లేదని అంటున్నారు. దాంతో ఎమ్మెల్సీ పోస్టు విషయంలో కమలనాధులు చాలా ఒత్తిడి పెడుతున్నారని అంటున్నారు.

ఇదిలా ఉంటే బీజేపీ నుంచి ప్రధానంగా మూడు పేర్లు ఎమ్మెల్సీ రేసులో వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఇందులో ప్రధానమైనది. ఆయనకు అనపర్తి సీటు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నారని అంటున్నారు. ఆయన కోరిన చోట ఇవ్వలేదని ఆయన అలిగారని ప్రచారంలో ఉంది. మొత్తానికి ఎమ్మెల్యే కావాల్సిన టైం లో బ్యాడ్ లక్ సోము వీర్రాజుకు దెబ్బేసింది.

పైగా ఆరెస్సెస్ నేపథ్యం నుంచి ఉన్న నాయకుడు కేంద్ర బీజేపీ పెద్దలతో పరిచయాలతో ఆయన ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు అని అంటున్నారు. గతంలో కూడా ఒకసారి ఆయన ఎమ్మెల్సీగా 2015 నుంచి 2021 దాకా పనిచేశారు. అపుడు కూడా టీడీపీ మద్దతుతోనే నెగ్గారు. ఈసారి కూడా అదే లక్ కోరుకుంటున్నారు. అయితే ఆయన బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో టీడీపీ పట్ల కొంత వ్యతిరేక ధోరణిని అవలంబించారు అన్న చర్చ ఉంది.

అంతే కాదు టీడీపీతో పొత్తుకు ఆయన వ్యతిరేకమన్న భావజాలాన్ని కలిగి ఉన్నారని అంటున్నారు. దాంతో ఆయనకు ఎంతవరకూ ఎమ్మెల్సీ విషయంలో ప్రయారిటీ ఇస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఇక రాయలసీమ జిల్లాలకు చెందిన నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఈయన కూడా సీనియరే. అనంతపురానికి చెందిన ఈయన ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కూటమి పొత్తులలో భాగంగా కోరుకున్నారు. కానీ దక్కలేదు. ఇపుడు ఎమ్మెల్సీ అయినా ఇస్తారని ఆయన అనుచరులు ఆశపడుతున్నారు. ఆయనకు కేంద్ర పెద్దల మద్దతు ఉంది. కానీ టీడీపీ వ్యతిరేక భావజాలం ఆయనకు ఉందని ఒక ప్రచారం ఉంది ఇదే మైనస్ అవుతుందా అన్న చర్చ సాగుతోంది.

ఇక విశాఖపట్నానికి చెందిన పీవీఎన్ మాధవ్ సైతం రేసులో ఉన్నారు. ఈయన బీసీ వర్గానికి చెందిన వారు. అలాగే ఉత్తరాంధ్ర వాసి. ఇక ఆయన గతంలో టీడీపీ మద్దతుతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆయన సౌమ్యుడు, వివాదరహితుడు, పైగా టీడీపీతో కలసి పనిచేయడానికి ఆయన అనుకూలంగా ఉంటారు అన్నది కూడా ఉంది. ఆయనకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మద్దతు ఉందని అంటున్నారు.

దీంతో చంద్రబాబు సైతం ఆయన అభ్యర్ధిత్వం పట్ల మొగ్గు చూపిస్తున్నారు అని అంటున్నారు. బీజేపీకి ఒక సీటు ఇవ్వాల్సి వస్తే ఎమ్మెల్సీ అయ్యేది కచ్చితంగా పీవీఎన్ మాధవ్ అని అంటున్నారు. మిగిలిన ఇద్దరి విషయంలో మాత్రం కాస్తా ఆలోచించాల్సిందే అంటున్నారు.

Tags:    

Similar News