వైసీపీని గోదావరి మింగేస్తుందా ?
ఈ నేపథ్యంలో వైసీపీ మళ్లీ వెలుగులు వస్తాయని ఆశిస్తోంది.
వైసీపీ పన్నెండేళ్ల క్రితం పుట్టిన పార్టీ. బలమైన పార్టీ. ఒకసారి భారీ మెజారిటీతో అధికారం దక్కించుకున్న పర్టీ. ఒకసారి బలమైన ప్రతిపక్షం గా ఉంది. ఈసారి ఎన్నికలే బాగా దెబ్బేశాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మళ్లీ వెలుగులు వస్తాయని ఆశిస్తోంది.
అయిదేళ్ళ తరువాత ఏపీలో వైసీపీదే అధికారం అని అధినాయకత్వం ధీమాగా ఉంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రతీ అయిదేళ్లలో ఏపీ ప్రజలు అధికారం మార్పు కోరుకోవడం అయితే రెండవది ఏపీలో ఏకైక విపక్షంగా వైసీపీ ఉండడం కూడా కలసి వస్తుందని ఆ పార్టీ హై కమాండ్ గట్టిగా నమ్ముతోంది. అందుకే జాగ్రత్తగా ఈ అయిదేళ్ళూ ఉంటే చాలు యాంటీ ఇంకెంబెన్సీతో అధికారంలోకి రావచ్చు అని భావిస్తోంది. అయితే వైసీపీకి గోదావరి జిల్లాలు మాత్రం షాకుల మీద షాకులు ఇస్తున్నాయి.
ఈ జిల్లాలలో 2019 ఎన్నికల్లో అద్భుతమైన విజయాలను సాధించిన వైసీపీ 2024 తరువాత ఓటమితో కుంచించుకుపోయింది. చాలా మంది పార్టీ నేతలు వైసీపీని వీడిపోతున్నారు. కొందరు నేతలు సైలెంట్ అవుతున్నారు.
చిత్రమేంటి అంటే వీరిలో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. గోదావరి జిల్లాలలో టీడీపీ బలంగా ఉంది. అదే సమయంలో జనసేన కూడా గట్టిగా ఉంది. జనసేనను ఒక బలమైన సామాజిక వర్గం విశేషంగా ఆదరిస్తోంది. తమ సొంత పార్టీగా చేసుకుంటోంది. ఆ పార్టీని తమ భవిష్యత్తు ఆశలకు ఆలంబనగా చేసుకుంటోంది.
దాంతో పాటు జనసేన టీడీపీ కూటమి అధికారంలో ఉండడం కూడా వైసీపీకి గోదావరి జిల్లాలలో ప్రతికూల రాజకీయాన్ని కలుగచేస్తున్నాయి. వైసీపీలో చురుకైన నాయకులు ఉన్నా వారంతా ఇపుడు ఇనాక్టివ్ అవుతున్నారు. అక్కడ ఒక సామాజికవర్గం నాయకులు వైసీపీలో ఉంటూ రాజకీయాలు చేయాలనుకున్నా ఆ సామాజిక వర్గం ప్రజల నుంచి కూడా అనుకున్నంత ఆదరణ దక్కడం లేదు.
జనసేన ఉండగా వేరే పార్టీలో పని చేయడమేంటి అన్న ప్రస్తావనను కూడా జనాలు తెచ్చి వారికి ఎదురు నిలుస్తున్నారు. ఒక రకంగా ఇది సంకట పరిస్థితి కలుగచేస్తోంది అని అంటున్నారు. ఎలా అంటే తెలంగాణా ఉద్యమ సమయంలో వేరు వేరు పార్టీలలో ఉన్న వారిని ప్రాంతీయ వాదంతో బలంగా ప్రజలు అడ్డుకునేవారు. వారంతా చేరాల్సింది ఉండాల్సింది టీఆర్ఎస్ తప్ప మరొకటి కాదు అని కూడా చెబుతూ ఒత్తిడి పెట్టేవారు.
ఇపుడు అలాంటి సారూప్యమే గోదావరి రాజకీయాల్లోనూ కనిపిస్తోంది అని అంటున్నారు. టీడీపీకి కూడా ఇలాంటి సమస్య ఉండాల్సిందే కానీ ఆ పార్టీ కూటమిలో మిత్రుడిగా ఉంది. పైగా అధికారంలో ఉంది. దాంతో వైసీపీ లీడర్ల మీదనే ఒక రకమైన ప్రెజర్ బిల్డప్ అవుతోంది అని అంటున్నారు.
దాంతో వారు తాము అనుకున్న పార్టీలో రాజకీయం చేయలేని పరిస్థితి కూడా ఉందని అంటున్నారు. వీటికి తోడు చాలా ఆకర్షణలు అధికారాలు ఇవన్నీ కూడా బలంగా పనిచేయడంతో వైసీపీ గోదావరి జిల్లాలో అల్లాడిపోతోంది. ఆ పార్టీ అక్కడ నిలిచి నిలదొక్కుకోవడం మాత్రం టఫ్ జాబ్ గా మారేలా ఉంది.
నిజానికి 2014 నుంచి 2019 దాకా వైసీపీ విపక్షంలో ఉన్నా గోదావరి జిల్లాలలో బలంగానే ఉంది.ఎవరిని నచ్చిన పార్టీలో చేరి రాజకీయం చేసుకునే వారు. ఇపుడు అలా కాదు వైసీపీకి భారీ ఓటమి సంభవించడం జనసేన అధికారంలో భాగం కావడంతో జనసేన అధినేత పవన్ అప్పట్లో పిలుపు ఇచ్చినట్లుగా గోదావరి జిల్లాల నుంచి వైసీపీని లేకుండా చేసే కార్యక్రమం అయితే సాగుతోంది.
దీనిని తట్టుకుంటూ ముందుకు సాగే మార్గాలను అయితే వైసీపీ అన్వేషించలేకపోతోంది. అక్కడ రాజకీయంగా చైతన్యం ఉన్న బలమైన సామాజిక వర్గం అండ వైసీపీకి ఇపుడు దక్కడం అంటే కొంత ఆలోచించాల్సిందే అని అంటున్నారు. మరి ఇదే తీరు ఎప్పటికీ ఉంటుందా అంటే రాజకీయాలు నిరంతరం సాగే నది లాంటివి అవి మారుతూ ఉంటాయి.
అలాటి వాతావరణం రావాలి. అంటే కూటమి మీద వారి పాలన మీద కొంత వ్యతిరేకత రావాలి. అప్పటిదాకా గోదావరిలో ఈ ఒడుదుడుకులు ఎదుర్కొంటూ వైసీపీ ఎదురీత ఈదాల్సిందే అని అంటున్నారు. అంతే కాదు అప్పటివరకూ వైసీపీని బతికించుకోవడం కూడా చేయాల్సి ఉంది.లేకపోతే గోదావరిలో మునకే అని అంటున్నారు.