విపక్షంలోనూ వైసీపీ నలిగిపోతోంది !
అమరావతి ప్రాంత జిల్లాల ప్రజానీకంతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ జనాలు కూడా వైసీపీకి ఓటెత్తారు.;
ఏపీలో వైసీపీకి 151 సీట్లు ఇచ్చి జనాలు బంపర్ మెజారిటీ అప్పగిస్తే ప్రజా తీర్పుని వైసీపీ వేరే విధంగా అర్ధం చేసుకుంది అన్న చర్చ అప్పట్లోనే నడచింది. అమరావతి ప్రాంత జిల్లాల ప్రజానీకంతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ జనాలు కూడా వైసీపీకి ఓటెత్తారు. అయితే ఏపీకి మూడు రాజధానులు అంటూ వైసీపీ కొత్త విధానం తీసుకుంది.
అసలే ఒక్క రాజధాని కూడా లేని ఏపీకి మూడు రాజధానులు ఏమిటి అన్నది అంతా ఆలోచించారు. పైగా అమరావతి ప్రాంత జిల్లాలు జగన్ కి మద్దతు ఇచ్చింది బాబు కంటే వేగంగా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా మూడు రాజధానులు అంటూ అటూ ఇటూ తిప్పుతూ వైసీపీ చివరికి అన్ని ప్రాంతాలకు చెడ్డ అయిపోయి 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయింది.
ఓడి పది నెలలు అయినా వైసీపీ మూడు రాజధానుల విషయంలో ఏమీ చెప్పలేదు. అలాగని అమరావతి రాజధానికి మద్దతు కూడా ప్రకటించలేదు. ఫుల్ సైలెంట్ గా ఉంది. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు వైసీపీ ఇపుడు మూడు రాజధానుల విషయంలో తన పాత స్టాండ్ కి కట్టుబడి లేదన్నట్లుగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. అంటే మూడు రాజధానుల విషయంలో పునరాలోచించుకుంటామని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు.
ఇక ఈ విషయం మీద సాధ్యమైంత తొందరలో వైసీపీ ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. అమరావతి రాజధానికి జై కొడితే టీడీపీ కూటమికి జై కొట్టినట్లే అని అంటున్నారు. అలా కాకుండా మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెబితే ఇప్పటికే తల బొప్పి కట్టి ఉన్న నేపధ్యం కళ్ళ ముందు ఉంది. దాంతో జనాలు కూడా నమ్మేది ఉండదని అంటున్నారు.
అంటే ఒక వైపు అమరావతి ఏకైక రాజధాని అంటే ఆభిజాత్యం అడ్డు వస్తుంది. కాదని అంటే బూమరాంగ్ అవుతుంది. అడ కత్తెరలో వైసీపీ ఈ విధంగా పడి నలిగిపోతోంది అని అంటున్నారు. నిజానికి వైసీపీ ఇప్పటికిపుడు తన నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం అయితే లేదు. ఎన్నికలు మరో నాలుగేళ్ళకు పైగా దూరంలో ఉన్నాయి.
దాంతో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా డెసిషన్ తీసుకోవచ్చు. ఈ లోగా కూటమి అమరావతి రాజధాని నిర్మాణం ఏ మేరకు వచ్చింది అన్నది స్పష్టం వస్తుంది. అలాగే మిగిలిన ప్రాంతాల వారి మనోభావాలను కూడా చూసుకుని తన ఆలోచనలను చెప్పవచ్చు. కానీ బొత్స మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు మూడు రాజధానులు అన్నాం, ఈ రోజు ఆలోచించుకుని చెబుతామని చెప్పేశారు.. దాంతో యూ టర్న్ వైసీపీ తీసుకుంటుంది అన్న అర్ధం వచ్చేలాగానే బొత్స వ్యవహరించారు అని అంటున్నారు.
ఇపుడు మూడు రాజధానుల విషయంలో వైసీపీ తన నిర్ణయం చెప్పి అమరావతికి జై కొడితే రాజకీయంగా ఆ పార్టీకి కొత్తగా కలసి వచ్చేది ఉండదు, మైలేజ్ కూడా దక్కదు. అదే సమయంలో టీడీపీ నిర్ణయం కరెక్ట్ అయిందని మరింతగా పసుపు పార్టీ మీద జనాలకు మరింత నమ్మకం పెరుగుతుంది. అలా వారికే మైలేజ్ వస్తుంది.
మరో వైపు అధికార పార్టీ మీద అమరావతి విషయంలో ఏ విధంగానూ విమర్శలు చేసే చాన్స్ ఉండదు. రాయలసీమ ఉత్తరాంధ్రా వెనకబాటుతనం మీద ఎంత మాట్లాడినా అభివృద్ధి అజెండా ఏది అన్న ప్రశ్నకు జవాబు కూడా చెప్పుకోలేరు. మొత్తం మీద వైసీపీ మూడు రాజధానుల విషయంలో బాగా ఇబ్బంది పడుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో.