వాలంటీర్లకు జగన్ టికెట్ ఇస్తారా...!?
జగన్ వాలంటీర్లకు వందనం సభలో మాట్లాడుతూ వాలంటీర్లను ఫ్యూచర్ లీడర్స్ గా అభివర్ణించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. ప్రయోగాలకు ఆయన సిద్ధం అంటూ ఉంటారు. చాలా మందిని అలా చట్ట సభలకు పంపించిన ఘనత జగన్ కి దక్కుతుంది. జగన్ వాలంటీర్లకు వందనం సభలో మాట్లాడుతూ వాలంటీర్లను ఫ్యూచర్ లీడర్స్ గా అభివర్ణించారు.
వారి సేవా భావం నాయకత్వ లక్షణాలు భవిష్యత్తులో మంచి నాయకులుగా మారడానికి కారణం అవుతాయని జగన్ చెప్పారు. మరి వాలంటీర్ల వ్యవస్థను ఏపీలో సృష్టించింది జగన్. ఏపీలో రెండు లక్షల అరవై వేల మంది దాకా వాలంటీర్లు ఉన్నారు. వీరు ప్రజలతో మమేకం అవుతున్నారు.
ఒక విధంగా వారు వైసీపీ సైన్యంగా ఉన్నారు. జగన్ అదే చెప్పుకున్నారు. మీరే నా స్టార్ కాంపెనియర్లు అని ఆయన అంటున్నారు. మీరు జనంలోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని చెప్పాలని కూడా ఆయన సూచించారు. వాలంటీర్లు అంటే సేవా హృదయాలు అని కూడా కొనియాడారు. జగన్ ఈ విధంగా వాలంటీర్లను కొనియాడడం చర్చనీయాంశం అవుతోంది.
వాలంటీర్ల నుంచే రేపటి నాయకులు వస్తారు అన్న జగన్ మాటల వెనక అర్ధాలు ఏమిటి అన్న చర్చ సాగుతోంది. నందిగం సురేష్ లాంటి వారిని ఎంపీలుగా పంపించిన జగన్ మదిలో కొత్త ఆలోచనలు మెదులుతున్నాయా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా జనంలో ఉంటున్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతీ పధకం గురించి వారికి బాగా తెలుసు.
అలాగే జనంలో ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నాయో వారికి మాత్రమే తెలుసు. జనంతో గ్రౌండ్ లెవెల్ లో తిరుగుతున్నది కూడా వారే. అలాంటి వాలంటీర్లకు పురస్కారాలు ఇస్తోంది వైసీపీ ప్రభుత్వం నగదు బహుమతులను కూడా బాగా పెంచుకొస్తోంది. ఇపుడు వాలంటీర్లలో లీడర్లను కూడా జగన్ చూస్తున్నారు.
దీనిని బట్టి చూస్తే జగన్ మదిలో వాలంటీర్లు కీలకంగా ఉన్నారు అని అర్ధం అవుతోంది. ఈ ఎన్నికల్లో వారిలో ఏవరికైనా టికెట్ ఇస్తారా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఒకవేళ ఇపుడు కాకపోయినా రానున్న కాలంలో అయినా లోకల్ బాడీ ఎన్నికల నుంచి వారిని ముందుకు తీసుకుని వచ్చే ఆలోచనలు వైసీపీకి ఉన్నాయని జగన్ మాటలను చూస్తే అర్ధం చేసుకోవాలని అంటున్నారు. వాలంటీర్ల మీద పూర్తి నమ్మకం ఉంచి వైసీపీ ముందుకు సాగుతోంది.
రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు అంటే పెద్ద సైన్యమే. ఒక్కొక్క వాలంటీరు చేతిలో యాభై కుటుంబాలు ఉన్నాయి. ఈ లెక్క చూస్తే వైసీపీ పకడ్బందీ వ్యూహాలు అర్ధం అవుతాయి. పోల్ మేనేజ్మెంట్ కి వాలంటీర్లు అసలైన సారధులుగా వైసీపీ భావిస్తోంది. అందుకే వాలంటీర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. మరి వైసీపీ అధినేత వాలంటీర్ల విషయంలో రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకుని వారికి కొత్త దారి చూపిస్తారా అంటే వైసీపీ వైపే అంతా దృష్టి సారించాల్సి ఉంటుంది.