తెలంగాణాలో టీడీపీని దూరం పెడతారా ?
టీడీపీతో ఏపీకే దోస్తీని పరిమితం చేస్తూ తెలంగాణాలో మాత్రం జనసేనతోనే కలసి నడవాలని బీజేపీ కొత్త ఆలోచనలు చేస్తోందిట.
ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఈ కూటమిలో టీడీపీ జనసేన, బీజేపీ ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కలసి అధికారాన్ని పంచుకున్నాయి. ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. అదే విధంగా చూస్తే మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణాలో ఎన్డీయే కూటమిలో టీడీపీ ఉంటుందా అంటే ప్రస్తుతానికి వినిపిస్తున్న వార్తల బట్టి చూస్తే ఉండదు అని అంటున్నారు.
టీడీపీతో ఏపీకే దోస్తీని పరిమితం చేస్తూ తెలంగాణాలో మాత్రం జనసేనతోనే కలసి నడవాలని బీజేపీ కొత్త ఆలోచనలు చేస్తోందిట. దానికి కారణం ఏమీ లేదు. టీడీపీ మద్దతుదారులను బీజేపీ తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలు బీజేపీకి దక్కారూ అంటే టీడీపీ ఓటు బ్యాంక్ అటు వైపు మళ్ళింది అని భావిస్తున్నారు.
ఇక బీఆర్ ఎస్ ఓటు బ్యాంక్ ఎటూ బీజేపీ బాగా చీల్చుకుంది. తన వైపు లాగేసుకుంది. అదే టీడీపీ కనుక తెలంగాణాలోకి ఎంట్రీ ఇస్తే దాని వల్ల బీఆర్ ఎస్ కి లాభం తప్ప మరోటి కాదు అని బీజేపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఇక జనసేన విషయంలో చూస్తే అక్కడ మున్నూరు కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ఆ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసేలా జనసేనతో దోస్తీ కడితే ముందు ముందు అధికారంలోకి వచ్చే అవకాశాలు బాగా ఉంటాయని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారుట. అందుకే తెలంగాణాలో రానున్న రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని బీజేపీ అనుకుంటోందని చెబుతున్నారు
పవన్ కళ్యాణ్ సైతం బీజేపీతో కలసి తెలంగాణాలో తన పార్టీని విస్తరించుకోవడానికి చూస్తున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కొండగట్టు ఆంజనేయుడు ఆలయానికి వస్తే జనాలు తండోపతండాలుగా హాజరయ్యారు. పవన్ కి తెలంగాణాలో ఉన్న క్రేజ్ కి ఇది నిదర్శనం అని అంటున్నారు
ఏపీలో చూస్తే జనసేన అధికారంలో ఉంది. దాంతో పార్టీ విస్తరణ మీద పూర్తిగా దృష్టి పెట్టింది. రానున్న అయిదేళ్ళలో బలమైన శక్తిగా ఏపీలో మారాలని చూస్తోంది. అదే విధంగా ఏపీలో తన అధికార బలంతో తెలంగాణాలోనూ జనసేనను విస్తరించాలని పవన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
తెలంగాణాలో బీజేపీతో కలసి ముందుకు సాగుదామని పార్టీ నేతలతో పవన్ అన్నట్లుగా చెబుతున్నారు తెలంగాణాలో బీఆర్ఎస్ బలహీన పడుతోంది. ఆ రాజకీయ శూన్యతను సొమ్ము చేసుకునే పనిలో బీజేపీ ఉంది. దానికి ఒక ప్రాంతీయ పార్టీ ఊతం కావాలి. ఆ లోటుని జనసేన ద్వారా తీర్చుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.
ఇక లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్ గా జనసేన బీజేపీ మరింత జోరు చేస్తాయని రాజకీయంగా బలపడాలని చూస్తాయని అంటున్నారు. అది 2028 నాటికి తెలంగాణాలో అధికారంలోకి వచ్చే దిశగా సాగాలని కూడా వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణాలో టీడీపీ లేకుండా జనసేన బీజేపీ దోస్తీ కడతాయని అంటున్నారు.