వాలంటీర్లకు వరమిచ్చినట్లేనా ?!

తాజాగా త్వరలో వాలంటీర్ల వ్యవస్థ మీద ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి వీరాంజనేయ స్వామి చేసిన ప్రకటన వాలంటీర్లలో కొత్త ఆశలు రేపింది.

Update: 2024-07-28 11:30 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరంలో హాట్ టాపిక్ గా నిలిచిన వాలంటీర్లు గత మూడు నెలలుగా విధులకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఆ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. తాజాగా త్వరలో వాలంటీర్ల వ్యవస్థ మీద ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి వీరాంజనేయ స్వామి చేసిన ప్రకటన వాలంటీర్లలో కొత్త ఆశలు రేపింది.

ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం సంక్షేమ పథకాల అమలుతో పాటు ఎన్నికల విధులకు కూడా వాలంటీర్లను దూరంగా ఉంచింది. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెల్లడయినా వారి విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు. వైసీపీ పాలనలో సంక్షేమ పథకాల అమలుకోసం అంటూ రూ.5 వేల గౌరవ వేతనంతో వాలంటీర్లను నియమించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం లక్ష 67 వేల మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలుస్తుంది. రెండు లక్షల 65 వేల మంది వాలంటీర్లకు గాను ఎన్నికలకు ముందు లక్ష పైచిలుకు వాలంటీర్లు విధులకు రాజీనామా చేశారు. వైసీపీ నేతల పిలుపు మేరకు వారు అప్పట్లో రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారికి తాము వేతనాలు ఇస్తామని కొందరు వైసీపీ నేతలు హామీ ఇచ్చారు.

అయితే ప్రస్తుతం వాలంటీర్లు లేకుండానే ఒక్క రోజులో ప్రభుత్వం ఫించన్లను పంపిణీ చేసింది. మరి ఇప్పుడు ఈ వ్యవస్థ అవసరమా ? అన్న వాదన వినిపిస్తుంది. ఇక ఈ వ్యవస్థలో అందరూ వైసీపీకి చెందిన వారే ఉన్నారు. మరి ఇప్పుడు పాత వారిని కొనసాగించడమా ? కొత్త వారిని నియమించడమా ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎక్కువ మంది టీడీపీ ప్రజాప్రతినిధులు ఈ వ్యవస్థను కొనసాగిద్దాం అని అంటున్నట్లు తెలుస్తుంది. మరి ప్రభుత్వం కొత్తవారిని నియమిస్తుందా ? పాతవారిని కొనసాగిస్తుందా ? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది వేచిచూడాలి.

Tags:    

Similar News