రాయలసీమలో వైసీపీ పట్టు బిగిస్తుందా...!?

ఇక 2019లో చూస్తే మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాలకు గానూ 52 అసెంబ్లీ సీట్లకు గానూ 49 సీట్లను గెలుచుకుంది.

Update: 2024-02-18 01:30 GMT

రాయలసీమ అంటే వైసీపీకి కంచుకోట ప్రాంతం. 2014, 2019లలో కూడా ఇక్కడే వైసీపీ జెండా పాతింది. ఇక 2019లో చూస్తే మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాలకు గానూ 52 అసెంబ్లీ సీట్లకు గానూ 49 సీట్లను గెలుచుకుంది. ఈసారి అదే ఊపు కొనసాగించాలని వైసీపీ భావిస్తోంది.

వైసీపీకి రాయలసీమలో ఇదే స్థాయిలో సీట్లు దక్కితేనే మరోసారి ఏపీలో అధికారం దఖలు పడుతుంది అన్నది ఆ పార్టీ పెద్దలకూ తెలుసు అని అంటున్నారు. రాయలసీమలో కడప, కర్నూల్ లలో గత సారి స్వీప్ చేసిన వైసీపీ అనంతపురంలో రెండు చిత్తూరులో ఒకటి మాత్రమే టీడీపీకి వదిలేసింది.

ఇపుడు క్లీన్ స్వీప్ అని వైసీపీ నేతలు అంటున్నా కూడా 2019 నాటి మ్యాజిక్ రిపీట్ చేయడం కష్టసాధ్యం అంటున్నారు. అయిదేళ్ల పాలన తరువాత తప్పకుండా యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. అదే విధంగా చూస్తే టీడీపీ గ్రాఫ్ గతం కంటే పెరిగింది అని అంటున్నారు. ఇపుడు కొత్తగా జనసేనతో పొత్తు కూడా కలసి వస్తుంది అని లెక్క వేస్తున్నారు.

వీటికి తోడు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకుంటే దెబ్బ పదేది వైసీపీకే అని అంటున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ పూర్వపు బలాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. అందుకే వ్యూహాత్మకంగా సిద్ధం సభను రాయలసీమ జిల్లాలకు కేంద్ర బిందువుగా చేసుకుని అనంతపురంలో నిర్వహిస్తోంది. ఈ సభకు పది లక్షల మంది దాకా కార్యకర్తలను సమీకరించాలన్నది వైసీపీ లక్ష్యం.

రాయలసీమ జిల్లాల వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం సిద్ధం సభను గ్రాండ్ సక్సెస్ చేసే బాధ్యతలను భుజస్కందాల మీద వేసుకున్నారు. ఈ సభతో రాయలసీమలో రీసౌండ్ చేయాలని వైసీపీ భావిస్తోంది. పైగా ఈ సభలో వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టోని కూడా రిలీజ్ చేస్తుంది అని అంటున్నారు.

ఈ సభ ద్వారా రాయలసీమలో పట్టు నిలుపుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఇటీవల కాలంలో రాయలసీమలో పెరుగుతున్న టీడీపీ గ్రాఫ్ ని అడ్డుకోవడమే కాకుండా వైసీపీ మునుపటి మాదిరిగా బలంగానే ఉంది అని తెలియచెప్పడమే ఈ సభ ముఖ్య ఉద్దేశ్యం అని అంటున్నారు.

ఉత్తరాంధ్రా జిల్లాలలో బలంగా ఉన్నామని చెప్పడానికి వైసీపీ భీమిలీలో సిద్ధం పేరుతో తొలి సభ నిర్వహించింది. ఆ తరువాత కోస్తా జిల్లాలలో సైతం తమ బలం చాటుకోవడానికి ఏలూరు వేదికగా మరో సభను నిర్వహించింది. అది సక్సెస్ అయింది. ఇపుడు ఆ రెండు సభలను తలదన్నే విధంగా అనంతపురం సభ ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఎప్పటికీ రాయలసీమ జిల్లాలు వైసీపీకి కంచుకోటలే అని చెప్పడానికే ఈ సభ అని అంటున్నారు. దాంతో అందరి కళ్లూ అనంతపురం మీదనే ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News