వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ ఇదే... ఫోటో గ్రాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రతిష్టాత్మక 2024 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డుని రాయిటర్స్‌ కి చెందిన ఫోటోగ్రాఫర్ మహ్మద్ సలేం గెలుచుకున్నారు.

Update: 2024-04-19 01:30 GMT

ప్రతిష్టాత్మక 2024 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డుని రాయిటర్స్‌ కి చెందిన ఫోటోగ్రాఫర్ మహ్మద్ సలేం గెలుచుకున్నారు. గాజా స్ట్రిప్‌ లో జరిగిన విధ్వంసాన్ని సూచించే విధంగా అతడు తీసిన ఫోటోకి ఈ అవార్డు వచ్చింది. ఈ ఫోటోలో... ఓ మహిళ తెల్లని వస్త్రంతో చుట్టబడి ఉన్న తన ఐదేళ్ల మేనకోడలి మృతదేహాన్ని హత్తుకుని విలపించే దృశ్యం కనిపిస్తుంది. ఈ ఫోటోకి తాజాగా అవార్డు లభించింది.

అవును... హమాస్ ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయేల్ జరిపిన దాడుల సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎన్నో దయణీయమైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి! ఈ సమయంలో... అక్టోబర్ 17, 2023న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌ లోని నాజర్ హస్పిటల్‌ లో ఓ మహిళ ఐదేళ్ల తన మేనకోడలి మృతదేహాన్ని హత్తుకుని రోదిస్తున్నప్పుడు ఈయన ఫోటో తీశారు!

36 ఏళ్ల ఇనాస్ అబు మామర్.. ఆస్పత్రి మార్చురీలో తన మేనకోడలు సాలీ భౌతికకాయాన్ని పట్టుకుని ఏడుస్తున్న క్షణాన్ని మహ్మద్ సలేం చిత్రీకరించారు. ఈ సందర్భంగా వరల్డ్ ప్రెస్ ఫోటో ఫౌండేషన్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... సంఘర్షణను కవర్ చేసే పాత్రికేయులు ఎదుర్కొంటున్న ప్రమాదాలను గుర్తించడం చాలా ముఖ్యమని పేర్కొంది.

పాలస్తీనాకు చెందిన 39 ఏళ్ల మహ్మద్ సలేం 2023 నుంచి రాయిటర్స్‌ లో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా అవార్డు గెలుచుకున్న అనంతరం స్పందించిన ఆయన... గాజా స్ట్రిప్‌ లో ఏం జరుగుతుందనే విషయాన్ని ఈ ఒక్క ఫోటో ప్రతిబింబిస్తుందని తాను భావించినట్లు తెలిపారు. ఓ మహిళ చిన్న అమ్మాయి మృతదేహాన్ని పట్టుకుని వదిలివేయడానికి నిరాకరించడం తన దృష్టిని ఆకర్షించిందని వెల్లడించారు.

ఇక, ఈ అవార్డు కోసం 130 దేశాల నుంచి 3,851 ఫోటో గ్రాఫర్‌ ల ద్వారా 61,062 ఎంట్రీలు వచ్చాయి. ఈ క్రమంలో మహ్మద్ సలేం తీసిన ఈ ఫోటో అవార్డుకి ఎంపికైంది.

Tags:    

Similar News