మరో రికార్డుకు చేరువలో మస్క్.. తొలి ట్రిలియనర్‌గా..

మస్క్ వార్షిక వృద్ధి సుమారు 109.88గా ఉంది. ఏడు కంపెనీలకు అధిపతి అయిన మస్క్.. స్పేస్ ఎక్స్, ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా కూడా ఇందులోనే ఉన్నాయి.

Update: 2024-09-10 05:09 GMT

రికార్డుల రారాజు ఎలన్ మస్క్. స్పేస్ ఎక్స్, టెస్లాతో ఇప్పటికే ఆయన వరల్డ్ రికార్డు స‌ృష్టించారు. ఏదో ఒక అంశంలో ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా కూడా మోసారి ఆయన వార్తల్లోకెక్కారు. ఆయన ఖాతాలో మరో రికార్డు నమోదు కాబోతోంది. ప్రపంచ ధనికుడైన ఆయన మరో రికార్డును సొంతం చేసుకోబోతున్నారు. ఇంతకీ ఆ రికార్డు ఏంటో ఒకసారి చూద్దాం..

ఎలన్‌మస్క్ 2027 నాటికి ట్రిలియన్ డాలర్లు కలిగిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కనున్నట్లు ఇన్ ఫార్మా కనెక్ట్ అకాడమీ వెల్లడించింది. ప్రపంచంలోనే ఆయన తొలి ట్రిలియనీర్‌గా నిలవబోతున్నట్లు పేర్కొంది. మస్క్ ఆదాయం ఏటా పెరుగుతూనే ఉంది. దాని ప్రకారమే ఈ అంచనా వేసినట్లు అకాడమీ తెలిపింది. దాంతో ఆ కొత్త రికార్డును మస్క్ క్రియేట్ చేయబోతున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో ఏ వ్యక్తి వద్ద కూడా ట్రిలియన్ డాలర్ల (లక్ష కోట్ల డాలర్లు.. రూ.83 లక్షల కోట్లకు పైగా) సంపద లేదు. కానీ.. మస్క్ మాత్రం మరో మూడేళ్లలో ఆ ఘనత సాధించబోతున్నారని తెలిపింది.

ఎక్స్ ప్లాట్ ఫామ్ ఓనర్ అయిన మస్క్.. ప్రస్తుతం 237 బిలియన్ల డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తితో కొనసాగుతున్నారు. మస్క్ వార్షిక వృద్ధి సుమారు 109.88గా ఉంది. ఏడు కంపెనీలకు అధిపతి అయిన మస్క్.. స్పేస్ ఎక్స్, ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా కూడా ఇందులోనే ఉన్నాయి.

టెస్లా మార్కెట్ కంపెనీ విలువ చూస్తే కూడా పెద్ద మొత్తంలోనే ఉండిపోయింది. ప్రస్తుతం ఆ విలువ 669.28 బిలియన్ డాలర్లుగా ఉంది. దాని ప్రకారం చూస్తే వచ్చే ఏడాది వరకు ఆ కంపెనీ ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం మెండుగా ఉంది.

ఎలన్ మస్క్ 2012లో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో తొలిసారి కనిపించారు. ఆ సమయంలో ఆయన ఆస్తి 2 బిలియన్ల డాలర్లు. తొలిసారి ఆయన 2021లో ప్రపంచ కుబేరుడైన బేజోస్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేసులోకి వచ్చారు. 2022 డిసెంబర్‌లో కొన్నాళ్లు వెనక్కి పోవాల్సి వచ్చింది. కేవలం ఆర్నెళ్లలోనే మళ్లీ మస్క్ టాప్ ప్లేస్‌ను ఆక్రమించాడు.

ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా మస్క్‌తోపాటు ట్రిలియనర్లు కాబోతున్న ఇతర వ్యాపారవేత్తలను సైతం ఇన్ ఫార్మా కనెక్ట్ అకాడమీ అంచనా వేసింది. వారిలో ఎన్‌విడియా వ్యవస్థాపకుడైన జెన్సెన్ హువాంగ్, ఇండోనేషియా పారిశ్రామిక వేత్త ప్రజోగో పంగెస్తు, ఫ్రెంచ్ దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌తోపాటు భారతీయ వ్యాపారి గౌతమ్ అదానీ సైతం ఉన్నట్లుగా తెలుస్తోంది. 2028 నుంచి 2030 వరకు వీరు ట్రిలియనర్లుగా మారే అవకాశం ఉందని అకాడమీ అంచనా వేసింది.

Tags:    

Similar News