140 నియోజకవర్గాల కౌంటింగ్ లో గోల్ మాల్ !
543 నియోజకవర్గాలకుగానూ డామన్ డయ్యూ, లక్షద్వీప్, కేరళలో అట్టింగల్ మినహా దాదాపు అన్ని స్థానాల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని
లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో గోల్ మాల్ జరిగిందా ? కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం పోలైన ఓట్ల కన్నా కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ ఓట్లను లెక్కించారా ? దాదాపు 140 నియోజకవర్గాలలో చోటు చేసుకున్న ఈ అవకతవకలకు సంబంధించి ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ ‘ది వైర్‘ ప్రచురించిన ఓ కథనం దేశంలో ప్రస్తుతం సంచలనంగా మారింది.
543 నియోజకవర్గాలకుగానూ డామన్ డయ్యూ, లక్షద్వీప్, కేరళలో అట్టింగల్ మినహా దాదాపు అన్ని స్థానాల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని.. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు సరిపోలడం లేదని ఈ కథనం వెల్లడించింది. ఏకంగా 140కిపైగా లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు అధికంగా ఉన్నాయని, ఈ వ్యత్యాసం 2 ఓట్ల నుంచి 3,811 ఓట్ల వరకు ఉన్నదని స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలు దశలవారీగా జరుగుతున్న సమయంలో ఎన్నికల సంఘం కచ్చితమైన పోలైన ఓట్ల సంఖ్యకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తల డిమాండ్ తర్వాతనే విడుదల చేసిన నేపథ్యంలో ఈ లెక్కలపై అనుమానాలు బలపడుతున్నాయి.
వాయువ్య ముంబై(మహారాష్ట్ర): 9,51,580 ఈవీఎం ఓట్లు పోలవగా, 9,51,582 ఓట్లు లెక్కించారు. అంటే రెండు ఓట్లు అధికంగా లెక్కించారు. ఈ స్థానంలో శివసేన(షిండే వర్గం) అభ్యర్థి కేవలం 48 ఓట్ల తేడాతో గెలిచారు.
జైపూర్ రూరల్(రాజస్థాన్): 12,38,818 ఓట్లు పోలవగా, 12,37,966 ఓట్లను లెక్కించారు. ఇక్కడ 852 ఓట్ల తేడా కనిపిస్తున్నది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 1,615 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
కంకేర్(ఛత్తీస్‌గఢ్): 12,61,103 ఈవీఎం ఓట్లు పోలవగా, 12,60,153 మాత్రమే లెక్కించారు. 950 ఓట్లు కౌంటింగ్‌లోకి రాలేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 1,884 ఓట్ల తేడాతో గెలిచారు.
ఫరూకాబాద్(యూపీ): 10,32,244 ఈవీఎం ఓట్లు పోలవగా, 10,31,784 మాత్రమే లెక్కించారు. 460 ఓట్లను లెక్కించలేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 2,678 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
విమర్శల తర్వాతనే కచ్చితమైన వివరాలు
లోక్‌సభ ఎన్నికలు దశలవారీగా జరుగుతున్న సమయంలో ఎన్నికల సంఘం కచ్చితమైన పోలైన ఓట్ల సంఖ్యకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తల డిమాండ్ తర్వాతనే విడుదల చేయడం గమనార్హం.
అస్సాంలోని కరీంగంజ్, ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు, మధ్యప్రదేశ్ లోని మండ్లా లోక్ సభ స్థానాలలో పోలైన దానికన్నా ఎక్కువ ఓట్లు లెక్కించగా, తమిళనాడు తిరువళ్లూరు, అస్సాం కోక్రాఝర్, ఒడిశాలోని ధేన్ కనాల్ స్థానాలలో తక్కువ ఓట్లు లెక్కించడం గమనార్హం.