హమాస్ అధినేత చివరి క్షణాలు... డ్రోన్ వీడియో వైరల్!

చనిపోయే ముందు అతడి చివరి కదలికలకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Update: 2024-10-18 04:45 GMT

గాజాలో హమాస్ తో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ అతిపెద్ద విజయం సాధించింది. గత కొన్ని రోజులుగా వరుసగా శత్రువులను మట్టుబడుతున్న ఐడీఎఫ్.. తాజాగా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇందులో భాగంగా... హమాస్ అధినేత సిన్వర్ ను మట్టుబెట్టింది. అయితే... చనిపోయే ముందు అతడి చివరి కదలికలకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

అవును... ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో హమాస్ కు కోలుకోలేని అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ కు తల్లివేరులా చెప్పె ఆ మిలిటెంట్ గ్రూపు అధినేత, అక్టోబరు 7నాటి దాడుల రూపకర్త యాహ్యా సిన్వర్ ను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. ఈ కీలక విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్ గ్యాలంట్.. సైనికులకు సెల్యూట్ చేశారు.

అనంతరం... సిన్వర్ మృతితో గాజా వాసులకు స్పష్టమైన సందేశం వెళ్లిందని అన్నారు. నేడు గాజా స్ట్రిప్ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు అతడి హంతక చర్యలే కారణమని స్పష్టం చేశారు. మరోపక్క.. సిన్వర్ ను హతమార్చి, లెక్కను సరిచేశామని.. అయినప్పటికీ యుద్ధం మాత్రం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.

వాస్తవానికి అక్టోబర్ 7న జరిగిన ఘటన అనంతరం తన ఉనికి తెలియకుండా యహ్యా సిన్వర్.. బంకర్లలోనూ, సొరంగాల్లోనూ తలదాచుకుంటున్నారు. ఫలితంగా... అతడి జాడను ఐడీఎఫ్ బలగాలు కనిపెట్టలేకపోయాయి. ఈ సమయంలో... అక్టోబర్ 16న రఫా నగరంలో మిలిటెంట్ల కదలికల నేపథ్యంలో ఇజ్రాయెల్ బలగాలు ఓ భవనంపై షెల్ ను ప్రయోగించాయి.

దీంతో ఆ భవనం కుప్పకూలిపోయింది. దీంతో.. సైనికులు ఆ భవనాన్ని పరిశీలించగా ముగ్గురు హమాస్ మిలిటెంట్లు చనిపోయి ఉన్నారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న ఐడీఎఫ్.. డీ.ఎన్.ఏ. పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఆ ముగ్గురిలో ఒకడు సిన్వర్ అని కన్ ఫాం చేసుకుంది. ఆ విషయాన్ని మీడియాకు వెళ్లడించింది. ఇది గొప్ప సక్సెస్ అని పేర్కొంది.

అయితే... చనిపోయే ముందు సిన్వర్ చివరి కదలికలకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ కదలికలను ఇజ్రాయెల్ డ్రోన్ రికార్డు చేసినట్లు చెబుతున్నారు. ఇందులో... ఓ శిథిల భవనంలోని సోఫాలో సిన్వర్ కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో డ్రోన్ అతడిని చిత్రీకరిస్తోంది. దాన్ని గమనించిన సిన్వర్.. ఓ కర్రలాంటి దాన్ని డ్రోన్ పైకి విసిరినట్లు వీడియోలో ఉంది.

Tags:    

Similar News