ప్రత్యర్థికి పదవి.. చక్రం తిప్పిన యనమల

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు చాలా కాలం తర్వాత తన రాజకీయ చతురత ప్రదర్శించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తునిలో టీడీపీ జెండా ఎగరేసిన యనమల.. ఇప్పుడు మున్సిపాలిటీలోనూ పాగా వేసేలా పావులు కదుపుతున్నారు.

Update: 2025-02-16 10:30 GMT

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు చాలా కాలం తర్వాత తన రాజకీయ చతురత ప్రదర్శించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తునిలో టీడీపీ జెండా ఎగరేసిన యనమల.. ఇప్పుడు మున్సిపాలిటీలోనూ పాగా వేసేలా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి, తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు పదవి వచ్చిన రోజే ఆయనను రాజకీయంగా దెబ్బతీశారు. దీంతో తుని రాజకీయం ఆసక్తికరంగా మారింది.

తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను రెండు రోజుల క్రితమే కాకినాడ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆ పార్టీ నియమించింది. వరుసగా మూడుసార్లు తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దాడిశెట్టి రాజా, గత ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. ఇక 2004 నుంచి 2019 వరకు జరిగిన వరుస ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీకి ఎదురుదెబ్బలే తగిలాయి. గత ఎన్నికల్లో తుని నుంచి వైసీపీ అభ్యర్థిగా రాజా పోటీ చేయగా, ఆయనపై యనమల కుమార్తె దివ్య పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా దాదాపు 20 ఏళ్ల తర్వాత తుని సీటు టీడీపీ వశమైంది.

అయితే చంద్రబాబు 4.0 ప్రభుత్వంలో యనమలకు షాక్ తగిలింది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన పదవులపై ఆశ వదులుకోలేదు. 1995లో చంద్రబాబు తొలిసారి సీఎం అయిన నుంచి యనమల కీలక పదవులు నిర్వహించారు. ముఖ్యంగా ఆర్థిక మంత్రిగా చంద్రబాబు ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచేవారు యనమల. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏమీ లేకపోవడంతో పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరిగింది. దీనికితోడు గత ఏడాది డిసెంబరులో కాకినాడ సెజ్ భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని లేఖ రాశారు. అదే సందర్భంగా ఆయన కొన్ని వివాదాస్పద విమర్శలు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన గ్యాప్ వచ్చినట్లు అనుమానాలు వ్యాపించాయి.

ఈ నేపథ్యంలో తాను పార్టీకి విధేయుడినని చెప్పుకున్న యనమల.. తన విధేయుత చాటుకునేందుకు తగిన సమయం కోసం వేచిచూశారని చెబుతున్నారు. అయితే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప ఎన్నికకు కొద్దిరోజుల క్రితం షెడ్యూల్ విడుదలైంది. అయితే మున్సిపాలిటీలో వైసీపీకి బలం ఉండటంతో ఆ ఎన్నిక యనమలకు సవాల్ గా మారింది. ఇక ఇదే సమయంలో ఆయన రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు వైసీపీ ప్రమోషన్ ఇచ్చింది. దీంతో ఇటు సొంత పార్టీలో ప్రత్యర్థులకు.. చిరకాల రాజకీయ ప్రత్యర్థికి ఒకేసారి షాక్ ఇవ్వాలని భావించిన యనమల.. వైసీపీ కౌన్సిలర్లతో ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముగ్గురు కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకున్నారు. ఇక తాజాగా ఒకేసారి పది మందికి టీడీపీలో చేర్చుకుని మున్సిపాలిటీలో ఆధిపత్యం సాధించారు. దీంతో త్వరలో జరిగే వైస్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. చాలా కాలం నుంచి స్థానిక రాజకీయాలపై పెద్దగా ఫోకస్ చేయని యనమల ఇప్పుడు పట్టుబిగించడంతో వైసీపీ నేతలు షాక్ తిన్నారు. ఏదైనా యనమల రాజకీయ చతురతలో వాడి తగ్గలేదని నిరూపించారు.

Tags:    

Similar News