సీమలో 'కడప'.. కోస్తాలో 'కొండపల్లి'.. తమ్ముళ్ల రగడ.. !
నెలకు 15 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే బూడిదను తాను రవాణా చేస్తానని వసంత కృష్ణ ప్రసాద్ పంతం పట్టారు.
రాయలసీమలోని కడప-అనంతపురం జిల్లాల్లో టీడీపీ-బీజేపీనాయకుల మధ్య రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద ఉత్పత్తి అయ్యే బూడిద(ఫ్లైయాష్) విషయంలో రగడ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బూడిదను తామంటే తామే రవాణా చేస్తామంటూ.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిలు పంతం పట్టారు. ఈ క్రమంలో పెను వివాదం కూడా చోటు చేసుకుంది. ఇది చివరకు సీఎం చంద్రబాబు వద్ద పంచాయితీ కూడా అయింది.
ఇక, ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో ఉన్న నార్ల తాతారావు ధర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే బూడిద విషయంలోనూ ఇదే రగడ చోటు చేసుకుంటోంది. అయితే, రాయల సీమ ప్రాజెక్టు కంటే కూడా..ఇక్కడ బూడిద ఎక్కువగా ఉత్పత్తి అవుతుండడం.. సొమ్ములు కూడా ఎక్కువగా వస్తుండడంతో అధికార పార్టీలో నాయకుల మధ్య దూకుడు పెరిగింది. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు.. మాజీ ఎమ్మెల్యేకు మధ్య వివాదం ముదిరింది.
నెలకు 15 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే బూడిదను తాను రవాణా చేస్తానని వసంత కృష్ణ ప్రసాద్ పంతం పట్టారు. అయితే.. ఎప్పటి నుంచో తమ వారే దీనిని రవాణా చేస్తున్నారని.. ఇప్పుడు అడ్డు పడడం ఎందుకని.. మాజీ ఎమ్మెల్యే ఒకరు అంటున్నారు. దీంతో వివాదం తారస్థాయికి చేరింది. మరోవైపు .. వైసీపీకి చెందిన ముఖ్య నాయకుడు కూడా.. ఈ విషయంలో వేలు పెట్టినట్టు తెలిసింది. బూడిద రవాణాను దక్కించుకునేందుకు ఆయన మరింత తక్కువ ధరలకే సరఫరా చేస్తానని చెబుతున్నారు.
ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలో మంత్రి నారా లోకేష్‌వద్ద ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పంచాయితీ పెట్టారు. దీనిపై ఆయన ఎటూ తేల్చ లేక.. వేచి చూసే ధోరణిలో ఉన్నారు. నేరుగా వివాదాలకు దిగి..రచ్చ చేసుకోకపోయినా.. అనంతపురం-కడప నేతల తరహాలోనే ఇక్కడ కూడా వివాదం జరుగుతోంది. అయితే.. నేతలు అంతర్గతంగా కలహించుకుంటున్నా.. బయటకు మాత్రం రాలేదు. వైసీపీ నేత జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు నారా లోకేష్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.