వాజపేయి సిద్ధాంతాలతో కొత్త పార్టీ.. బీజేపీ మాజీ నేత కీలక నిర్ణయం!?
ఈ ఏడాది చివర్లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఓ సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.
ఈ ఏడాది చివర్లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఓ సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కొత్త రాజకీయ పార్టీ స్థాపించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ప్రచారం జోరందుకుంది. ఈ సమయంలో... ఝార్ఖండ్ ఓటర్లకు ఈ పార్టీ ప్రత్యామ్నాయం కానుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పలువురు.
అవును... కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కొత్త రాజకీయ పార్టీని స్థాపించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఝార్ఖండ్ లోని అటల్ సేవా కేంద్రంలో తన మద్దతుదారులతో సమావేశమైన ఆయన... కొత్త పార్టీ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించినట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలు ప్రస్థావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి భారతీయ జనతాపార్టీ మాజీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు సురేంద్ర కుమార్ సిన్హా అధ్యక్షత వహించగా.. మాజీ ఎంపీ జయంత్ సిన్హా, పలువురు మద్దతుదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది ఝార్ఖండ్ ఓటర్లకు కచ్చితంగా ప్రత్యామ్నాయం కానుండని ఈ సందర్భంగా పలువురు మద్దతుదారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేలా పార్టీ పేరును "అటల్ విచార్ మంచ్"గా సిన్హా ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడిన యశంత్ సిన్హా... సమాజంలోని వివిధ వర్గాలను సంప్రదించిన అనంతరం అటల్ విచార్ మంచ్ ఏర్పాటుపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
కాగా... వాజపేయి ప్రభుత్వంలో యశ్వంత్ సిన్హా కేంద్రమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. హజీరాభాగ్ లోక్ సభ సీటు నుంచి 1998, 1999, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. 2004లో సీపీఐ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. 2014లో ఆయన పెద్దకుమారుడు జయంత్ సిన్హాకు బీజేపీ అదే స్థానంలొ టిక్కెట్ ఇవ్వగా.. ఆయన గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జయంత్ సిన్హాకు టిక్కెట్ దక్కలేదు!