బాబు చెంత‌కే వైసీపీ బీసీ నేత‌లు

ఈ కార్య‌క్ర‌మంలో ఉమ్మ‌డి నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల‌కు చెందిన నాయ‌కులు పాల్గొన్నారు

Update: 2024-10-09 14:36 GMT

వైసీపీకి, త‌మ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాల‌కు ఇటీవ‌ల రాజీనామా చేసిన కీల‌క నేత‌లు.. మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్‌రావులు తాజాగా సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరిపోయారు. చంద్ర‌బాబు నివాసంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఇరువురు నేతల కు ఆయ‌న పార్టీ కండువా క‌ప్పి సైకిల్ ఎక్కించారు. ఈ సంద‌ర్భంగా మోపిదేవి, బీద‌లు చంద్ర‌బాబును కూడా స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉమ్మ‌డి నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల‌కు చెందిన నాయ‌కులు పాల్గొన్నారు. అయితే.. వాస్త‌వానికి మోపిదేవి ఆది నుంచి కూడా టీడీపీలోనే చేర‌తాన‌ని చెప్పారు.

కాబ‌ట్టి మోపిదేవి విష‌యం పెద్ద చ‌ర్చ‌నీయాంశం కాదు.పైగా ఆయ‌న పార్టీలో చేర‌కుండానే.. ప‌లు టీడీపీ కార్య‌క్ర‌మాల్లోనూ.. ప్ర‌భు త్వ కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొన్నారు. తాజాగా కండువా మార్చేశారు. త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి కూడా ఆయ‌న రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. దీనికి ముందే మోపిదేవి తాను పార్టీలో చేర‌నున్నాన‌ని చెప్పుకొచ్చారు. కానీ, బీద మ‌స్తాన్ రావు విష‌యంలో మాత్రం కొంత గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా అయితే చేశారు కానీ.. ఏ పార్టీలో చేరేదీ అప్ప‌ట్లో వెల్ల‌డించ‌లేదు. దీంతో ఆయ‌న‌కు ఉన్న వ్యాపారాలు, కేంద్రంలో ఉన్న ప‌లుకుబ‌డి నేప‌థ్యంలో బీజేపీ బాట ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేశారు.

కానీ, నెల్లూరుకు చెందిన బీద‌ను టీడీపీలోకి తీసుకువ‌చ్చేందుకు అక్క‌డి మంత్రి నారాయ‌ణ విశేషంగా కృషి చేసిన‌ట్టు తెలుస్తోం ది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మ‌న‌సు మార్చుకుని సైకిల్ ఎక్కారు. ఇదిలావుంటే.. బీద మ‌స్తాన్‌రావు, బీద ర‌విచంద్ర యాద‌వ్‌లు.. ఆది నుంచి కూడా టీడీపీలోనే ఉన్నారు. మ‌స్తాన్‌రావు.. గ‌తంలో ఎంపీగా కూడా విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న వైసీపీ బాట ప‌ట్టారు. ఆయ‌న సోద‌రుడు ర‌విచంద్ర‌యాద‌వ్ మాత్రం టీడీపీలోనే ఉన్నారు. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన మోపిదేవి, బీద‌ల‌తో ఇప్పుడు టీడీపీ మ‌రింత బ‌ల‌మైన బీసీ శ‌క్తిగా అవ‌త‌రించ‌నుంద‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News