ఊచకోత కోస్తామంటూ చెలరేగిన బెన్నిలింగం ఎంతలా తగ్గారంటే?

పాస్టర్ ప్రవీణ్ పగడాలది కచ్ఛితంగా హత్యేనని.. అదేదో తనకళ్లతో తాను చూసినట్లుగా మాట్లాడటమే కాదు.. ఆవేశంతో విచక్షణ మరిచి ఇష్టారాజ్యంగా మాట్లాడటం తెలిసిందే.;

Update: 2025-04-08 05:30 GMT
ఊచకోత కోస్తామంటూ చెలరేగిన బెన్నిలింగం ఎంతలా తగ్గారంటే?

సమయం.. సందర్భం చూసుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. విషయాల మీద అవగాహన లేకున్నా చెలరేగిపోవటం.. ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఎవరికి వారు తమ భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవటంలో తప్పులు చేస్తున్నారు. దీనికి తోడు తమ అవాకులు చవాకుల్ని సోషల్ మీడియా వేదికల మీద మాట్లాడటం.. సమాజంలో లేని ఆగ్రహావేశాల్ని క్రియేట్ చేస్తున్నారు కొందరు. ఈ కోవలోకే వస్తారు వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెన్నిలింగం.

పాస్టర్ ప్రవీణ్ పగడాలది కచ్ఛితంగా హత్యేనని.. అదేదో తనకళ్లతో తాను చూసినట్లుగా మాట్లాడటమే కాదు.. ఆవేశంతో విచక్షణ మరిచి ఇష్టారాజ్యంగా మాట్లాడటం తెలిసిందే. పాస్టర్ ప్రవీణ్ ది కచ్ఛితంగా హత్యేనని.. అందులో ఎలాంటి అనుమానం లేదన్న బెన్నిలింగం.. ‘‘ఒక్క క్షణం బైబిక్ పక్కన పెడితే ఊచకోత కోస్తాం. మమ్మల్ని కెలకొద్దు. మేం మంచివాళ్లం కాదు మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు.. ఖబడ్డార్’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

బెన్నిలింగం చేసిన వ్యాఖ్యలపై పోలీసులు స్పందించటమే కాదు.. పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్యేనని చెప్పే ఆధారాల్ని తీసుకురావాలంటూ రాజానగరం పోలీసులు విచారణకు పిలిచారు. పోలీసుల నోటీసుల నేపథ్యంలో విచారణకు హాజరయ్యారు బెన్నిలింగం. ఇక్కడే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల విచారణలో భాగంగా.. తాను ఆ రోజు ఆవేశంతో మాట్లాడానని.. జనాల్ని చూసిన నేపథ్యంలో మాట్లాడానే కానీ.. తనకు మతవిద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం లేదని పేర్కొన్నారు.

అంతేకాదు.. తాను ఆరోపించినట్లుగా పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేశారని చెప్పే ఆధారాలు ఏవీ నా వద్ద లేవన్న బెన్నిలింగం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూపించారు. అయితే.. తాను మాట్లాడిన మొత్తం మాటల్లో కొన్నింటిని ఎడిట్ చేశారని.. మార్ఫింగ్ కూడా చేసినట్లుగా పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు పోలీసుల విచారణకు వచ్చిన బెన్నిలింగం.. సాయంత్రం వరకు పోలీసులు లోతైన విచారణ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై విచారణ అవసరమైతే పిలుస్తామని.. హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆవేశంతో నోరు పారేసుకోవటం కాదు.. తాము చెప్పే మాటలకు తగ్గ ఆధారాలు ఉన్న తర్వాతే నోరు విప్పితే బాగుంటుందన్న విషయాన్ని ప్రముఖులు మర్చిపోకూడదు.

Tags:    

Similar News