వారిని వదిలించుకున్న వైసీపీ.. ఇక వీరికే పెద్దపీట!

తాజాగా వైసీపీ మీడియా ముందు మాట్లాడాల్సిన అధికార ప్రతినిధుల జాబితాలో 14 మందికి చాన్సు ఇచ్చింది.

Update: 2024-09-10 07:16 GMT

ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి దారితీసిన ప్రధాన కారణాల్లో ఒకటి.. బూతులు తిట్టే నేతలను మీడియా ముందు ఎక్కువగా ప్రవేశపెట్టడం. బూతులు మాట్లాడే ఐదారుగురు నేతల వల్ల వైసీపీకి కలిగిన డ్యామేజీ అంతా ఇంతా కాదు. అన్ని పథకాలు ఇచ్చి కూడా ఘోరంగా ఓడిపోవడానికి ఈ బూతు నేతలే కారణమని ఆ పార్టీలోనే గట్టిగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ అలాంటి బూతు నేతలను ఎట్టకేలకు పక్కనపెట్టింది. పార్టీ తరఫున మీడియాతో మాట్లాడే అధికారుల ప్రతినిధుల జాబితాను వైసీపీ తాజాగా విడుదల చేసింది. వారిలో బూతు నేతలుగా ముద్రపడ్డ.. కొడాలి నాని, ఆర్కే రోజా, జోగి రమేశ్, రవిచంద్రారెడ్డి వంటివారు లేకపోవడం గమనార్హం.

వీరి స్థానంలో విషయ పరిజ్ఞానం, దూకుడుకు రాజకీయ విమర్శలు చేసేవారికి వైసీపీ పెద్ద పీట వేసింది. తాజాగా వైసీపీ మీడియా ముందు మాట్లాడాల్సిన అధికార ప్రతినిధుల జాబితాలో 14 మందికి చాన్సు ఇచ్చింది.

పి.శివశంకర్‌ రెడ్డి, నాగార్జున యాదవ్, సుందర రామశర్మ, కారుమూరి వెంకటరెడ్డి, కొండా రాజీవ్, నారమల్లి పద్మజ, కాకుమాను రాజశేఖర్, అంకంరెడ్డి నారాయణమూర్తి, అవుతు శ్రీధర్‌ రెడ్డి, కొమ్మూరి కనకారావు, వంగవీటి నరేంద్ర, పోతిన మహేష్, గూడపురెడ్డి వీరశేఖర్‌ రెడ్డి, చల్లా మధుసూదన్‌ రెడ్డి ఉన్నారు.

ఇకపై మీడియా చానెల్స్ కానీ, యూట్యూబ్‌ చానెల్స్‌ కానీ ఇంటర్వ్యూలకు, టీవీ చర్చలకు వీరిని మాత్రమే పిలవాల్సి ఉంటుంది. ఈ 14 మంది కాకుండా ఎవరైనా టీవీ చర్చలకు వెళ్లినా, యూట్యూబ్‌ చానెల్స్‌ తో మాట్లాడిన వాటితో వైసీపీకి ఎలాంటి సంబంధం ఉండదు. వాటిని వారి సొంత వ్యాఖ్యలుగా పరిగణిస్తారు. ఈ మేరకు వైసీపీ 14 మంది కొత్త అధికార ప్రతినిధులతో జాబితా విడుదల చేసింది. వీరిలో ఇప్పటికే కొందరు అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వీరితోపాటు మరికొందరికి అవకాశమిచ్చారు.

ముఖ్యంగా కొత్తగా అధికార ప్రతినిధి పదవులు దక్కించుకున్నవారిలో కొత్త ముఖాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలను బూతులు తిడుతూ అసభ్యంగా మాట్లాడేవారిని పక్కనపెట్టడం ద్వారా వైసీపీ మంచి నిర్ణయమే తీసుకుందని అంటున్నారు. వైసీపీ అధిష్టానానికి ఇప్పటికి జ్ఞానోదయమైందని చెప్పుకుంటున్నారు. ఈ కొత్త అధికార ప్రతినిధులన్నా మీడియా ముందు చక్కగా మాట్లాడి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నారు.

Tags:    

Similar News