వైసీపీ లేని లోటుని తీరుస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు ?

దాంతో ఎంతో కీలకమైన ప్రజా ప్రాధాన్యత కలిగిన బడ్జెట్ సెషన్ కి వైసీపీ దూరం పాటించినట్లు అయింది.

Update: 2024-11-17 03:00 GMT

ఏపీ అసెంబ్లీలో విపక్షం అన్నది లేదు. కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అయితే విపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ అంటోంది. దాంతో ఎంతో కీలకమైన ప్రజా ప్రాధాన్యత కలిగిన బడ్జెట్ సెషన్ కి వైసీపీ దూరం పాటించినట్లు అయింది.

ఇదిలా ఉంటే అసెంబ్లీలో నిండుగా మూడు పార్టీలతో కూడిన కూటమి సభ్యులే ఉన్నారు. మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో టీడీపీ నుంచే 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక వారిలో కూడా సీనియర్ ఎమ్మెల్యేలు అనేక మంది ఉన్నారు. వారంతా సభలో తన సీనియారిటీని చాటుకునేలా ప్రసంగాలు చేస్తున్నారు

ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఒక విధంగా వారు నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తున్నట్లుగా అనిపించినా అదే సమయంలో విపక్ష గొంతులు వారి నుంచి వినవస్తున్నాయా అన్న డౌట్లూ వ్యక్తం అవుతున్నాయి. నిన్నటికి నిన్న తూర్పు గోదావరి జిల్లా జగ్గయ్యపేట కు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన సీనియారిటీని సభలో పదే పదే చెప్పుకున్నారు.

ఆయన తనకు మాట్లాడేందుకు సమయాన్ని అత్యధికం కేటాయించాలని కూడా స్పీకర్ చెయిర్ లో ఉన్న రఘురామ క్రిష్ణం రాజుతో కోరారు. ఒక దశలో ఆయన అసహనానికి గురి అయి ప్రతిపక్ష సభ్యుడిగా పరిగణిస్తున్నారు అని కూడా వాపోయారు. మాట్లాడవద్దు అంటే మానేస్తాను అని కూడా అన్నారు.

ఇక ఆయన స్పీచ్ లో ప్రధానంగా ఏపీలో ఉచిత ఇసుక పధకం వల్ల ఇబ్బందులే వస్తున్నాయని ప్రభుత్వాన్ని సున్నితంగా విమర్శించారు. పాత విధానమే మేలు అన్నారు. ఉచిత ఇసుక పేరుతో ఎవరికీ న్యాయం జరగడం లేదని అన్నారు. దాంతో ఆయన అచ్చం వైసీపీ సభ్యులు మాదిరిగానే మాట్లాడారు అని చర్చ సాగింది.

ఇక ఆయన తరువాత మరో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వంతు వచ్చిందా అన్నది అంతా అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస చెందిన కూన రవికుమార్ అసెంబ్లీలో మాట్లాడుతూ జీరో అవర్ అన్నది డ్రైవర్ లేని బండిగా మారిందని అన్నారు. సభ్యులు మాట్లాడిన మాటలు లేవనెత్తిన ప్రశ్నలు మంత్రులు నోట్ చేసుకునే విధానం గతంలో ఉండేదని ఇపుడు అది కనిపించడం లేదని ఆయన అన్నారు.

దీంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అలాంటిది ఏమీ లేదని సభలో మంత్రులు నోట్ చేసుకుంటున్నారు అని చెప్పారు. ఆ మీదట అదే జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు కూడా అన్నీ నోట్ చేసుకుంటామని ఇక శాఖల వారీగా మంత్రుల వద్దకు ఈ సమస్యలు వస్తాయి వాటి మీద మంత్రులు మాట్లాడుతారని చెప్పారు.

అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఇద్దరు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు తమ సొంత ప్రభుత్వం మీదనే కాస్తంత అసంతృప్తితో మాట్లాడడం, నిజంగా వారు నిర్మాణాత్మకమైన చర్చను కోరుతూ అలా మాట్లాడారు అని అనుకోవచ్చు. కానీ ఏపీలో ఉన్న రాజకీయ నేపధ్యం పరిణామాల నుంచి చూసినపుడు మాత్రం వేరేగా కూడా ఆలోచిస్తున్నారు అని కూడా అంటున్నారు.

మంత్రి పదవులను ఈ ఇద్దరూ ఆశించారు అని ప్రచారంలో ఉంది. అది దక్కకపోగా ఆఖరుకి విప్ పదవులు కూడా దక్కలేదు. మొత్తానికి చూస్తే ఈ విధంగా టీడీపీలో అసంతృప్తి గళాలు చాలానే ఉన్నాయా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వంలో ఉన్నామని కాదు ప్రజా సమస్యల మీద ఎవరు గళమెత్తినా మంచిదే కదా అని అంతా అంటున్నారు. దాని వల్ల ప్రభుత్వానికి కూడా సమస్యలు తెలిసి పరిష్కారానికి నోచుకుంటాయని అంటున్నారు. సో ఈ విధంగా రానున్న రోజులలో టీడీపీ ఎమ్మెల్యేలే సమస్యలు లేవనెత్తితే వైసీపీ లేని లోటు పూర్తిగా తీర్చిన వారు అవుతారని కూడా అంటున్నారు.

Tags:    

Similar News