కూటమిలో చిచ్చు...వైసీపీ ఆశలు తీరేనా ?
కొన్ని విషయాల్లో ఓపెన్ అయిపోతూంటారు దాని వల్ల కూటమికి ఇబ్బందులు వస్తాయని కూడా అంటూంటారు.
ఏపీలో టీడీపీ కూటమి మూడు పార్టీలతో ఏర్పాటు అయింది. మూడు పార్టీలదీ భిన్న స్వభావాలు. ముందుగా జనసేన విషయానికి వస్తే పవన్ దూకుడు తో కూడిన రాజకీయం చేస్తారు. కొన్ని విషయాల్లో ఓపెన్ అయిపోతూంటారు. దాని వల్ల కూటమికి ఇబ్బందులు వస్తాయని కూడా అంటూంటారు.
ఇక కేంద్రంలో అధికారంలో బీజేపీ ఏపీ కూటమిలో భాగస్వామిగా ఉంది. కేంద్రం నిధులు అడిగినన్ని ఇవ్వకపోయినా ఇబ్బందే. లేదా కేంద్రంలోని బీజేపీ అజెండా ప్రకారం పెట్టే బిల్లులకు టీడీపీ మద్దతు ఇవ్వకపోయినా కూడా ఇరకాటమే.
తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అతి పెద్ద పార్టీ. కూటమిగా అంతా ఉన్నా టీడీపీ పెద్దన్న పాత్ర అటు నియోజకవర్గాలలో బాగా సాగుతోందని ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే మిత్రులను టీడీపీ ఎదగనీయకుండా చేస్తుందని కూడా ఆరోపణలు ఉన్నాయి. దాంతో పాటు కూటమిలో ఉన్న టీడీపీకి అన్ని నియోజకవర్గాలలోనూ పార్టీ ఉంది. నేతలు ఉన్నారు. క్యాడర్ ఉన్నారు.
వారికి నచ్చచెప్పి 31 సీట్లను మిత్రులకు టీడీపీ ఇటీవల ఎన్నికల్లో పంచడం జరిగింది. మరి ఆయా సీట్లలో టీడీపీ నేతలు ఇపుడు తన హవా చూపిస్తున్నారని ఫలితంగా కూటమిలో చిచ్చు రాజుకుంటోందని టాక్ గట్టిగా ఉంది. సరిగ్గా ఈ పాయింట్ల మీదనే వైసీపీ కూటమి లో విభేదాలు వస్తాయని కోటి ఆశలు పెట్టుకుంది.
వచ్చే ఎన్నికల నాటికి కూటమి విచ్చిన్నం అవుతుందని బీజేపీ జనసేన వేరేగా టీడీపీ వేరేగా పోటీ చేస్తుందని ఆశిస్తోంది. అలా జరిగితే కనుక కూటమి ఓట్లు చీలి వైసీపీకి ఎన్నికల్లో పెద్ద ఎత్తున అడ్వాంటేజ్ అవుతుందని కూడా అంచనా వేసుకుంటోంది. అయితే వైసీపీ ఆశలు ఎంతమేరకు ఫలిస్తాయన్నది చూస్తే కనుక అలాంటి వాతావరణం అయితే లేనే లేదని అంటున్నారు.
రాష్ట్ర స్థాయిలో టీడీపీ జనసేన పటిష్టమైన మైత్రీ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే లేటెస్ట్ గా కృష్ణ జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ చంద్రబాబు అనుభవాన్ని ఆకాశానికి ఎత్తేశారు. బాబే తనకు స్పూర్తి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.
దీనిని చూసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి విడిపోదనే అంతా అంటున్నారు. మరో వైపు చూస్తే కేంద్రంలోని బీజేపీకి నమ్మకమైన మిత్రులు పెద్దగా కనిపించడం లేదు. పైగా ఉత్తరాదిన ఆ పార్టీని భారీ రాజకీయ నష్టం వచ్చేలా ఉంది. దాంతో దక్షిణాది వైపే కమలం చూపు ఉంది. ఏపీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లతోనే బీజేపీ అనివార్యంగా పయనించాల్సి ఉంటోంది.
వారిని కాదని బీజేపీ చేసేది కూడా ఏమీ లేదని అంటున్నారు. దాంతో ముందస్తు ఎన్నికలు వచ్చినా లేక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా మూడు పార్టీలు కలసి పోటీ చేయడం కచ్చితం అని అంటున్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు కూడా అదే విధనమైన ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. టీడీపీ పటిష్టమైన పార్టీగా ఉన్నా వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకమైన చాన్స్ ఇవ్వకూడదని ఈ ఒక్కసారికీ కలసి పోటీ చేస్తే వైసీపీని రాజకీయంగా ఎలిమినేట్ చేసినట్లు అవుతుందని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. మొత్తంగా చూస్తే కనుక టీడీపీ కూటమి వెరీ స్ట్రాంగ్ గా ఉంది.
నియోజకవర్గాలలో వచ్చే గొడవలు ఎలా ఉన్నా రాష్ట్ర స్థాయిలో అధినేతల మధ్య మంచి కో ఆర్డినేషన్ ఉంది కాబట్టి కూటమి ఐక్యతకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని అంటున్నారు. సో వైసీపీ ఆశలు 2027లో ఎన్నికలు వచ్చినా లేక 2029లో వచ్చినా నెరవేరేలా లేవు అనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.