మండ‌లిలో మెజారిటీ ఉన్నా.. వైసీపీ వెన‌క‌డుగే...!

ఇదిలావుంటే.. శాస‌న స‌భ ఎలా ఉన్నా.. శాస‌న మండ‌లిలో వైసీపీకి భారీ సంఖ్యాబ‌ల‌మే ఉంది.

Update: 2024-11-20 13:30 GMT

మాజీ సీఎం జ‌గ‌న్ సార‌థ్యంలోని వైసీపీకి శాస‌న స‌భ‌లో పెద్ద‌గా మెజారిటీ లేదు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక ల్లో వైసీపీకి కేవ‌లం 11 మంది స‌భ్యులు మాత్ర‌మే ద‌క్కారు. ఇది ప్రజాతీర్పు కావ‌డంతో ఎవ‌రూ ఏమీ అన‌లే ని ప‌రిస్థితి. ఇక‌, 11 మందితో స‌భ‌కు వెళ్తే.. త‌న‌కు అవ‌మానాలుత‌ప్ప‌వ‌ని భావిస్తున్న‌జ‌గ‌న్ అస‌లు స‌భ‌కు కూడా వెళ్ల‌కుండా కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఇంట్లోనే మీడియా మీటింగులు పెట్టి ఊరుకుంటున్నారు. అయితే.. దీనిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

జ‌గ‌న్ స‌భ‌కు రావాలంటూ కూట‌మి పార్టీల మంత్రులు, నాయ‌కులు కూడా కోరుతున్నారు. అయినా.. జ‌గ‌న్ వినిపించుకోవ‌డం లేద‌న్న విష‌యం తెలిసిందే. ఇదిలావుంటే.. శాస‌న స‌భ ఎలా ఉన్నా.. శాస‌న మండ‌లిలో వైసీపీకి భారీ సంఖ్యాబ‌ల‌మే ఉంది. దీంతో ఇప్పుడు కార్య‌క్ర‌మాల‌న్నీ.. మండ‌లిలోనే ఎక్కువ గా జ‌రుగుతున్నాయి. వైసీపీ స‌భ్యులు క్ర‌మం త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతున్నారు. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం కూడా మండ‌లిని సెంట్రిక్‌గా చేసుకుని రాజ‌కీయాలు వండి వారుస్తోంది.

నిజానికి గ‌తంలోనూ వైసీపీ అధికారంలో ఉండ‌గా.. మండ‌లిలో టీడీపీ బ‌లంగా ఉంది. దీంతో వైసీపీకి ఊపి రి స‌ల‌ప‌నివ్వ‌ని విధంగా మండ‌లిలో టీడీపీ స‌భ్యులు విరుచుకుప‌డే వారు. కానీ, ఇప్పుడు వైసీపీకి బ‌లం ఉన్నా.. ఆ మేర‌కు దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. తాజాగా సోమ‌వారం నాటి మండ‌లి స‌మావేశాల‌ను చూస్తే.. రెండు సార్లు వైసీపీ స‌భ్యులు వాకౌట్ చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యా నికి గురి చేసింది.

పైగా విద్యుత్ సుంకం-2024 స‌వ‌ర‌ణ బిల్లును కూడా మండ‌లి ఆమోదించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి వైసీపీ ఈ బిల్లును మండ‌లిలో అడ్డుకుంటుంద‌న్న ఉద్దేశంతో కూట‌మి మంత్రులు స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా స‌భ‌కు వ‌చ్చారు. కానీ, ఎక్క‌డా కూడా వైసీపీ ఆ మేర‌కుబ ల‌మైన గ‌ళం వినిపించ‌లేక పోయింది. మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడినా.. ఆయ‌న వ్యాఖ్య‌లు బుజ్జ‌గింపు ధోర‌ణిలోనే ఉన్నాయ‌న్న చ‌ర్చ సాగింది. మొత్తంగా చూస్తే.. శాస‌న స‌భ‌లో ఎలానూ లేరు.. ఉన్న‌మండ‌లిలోనూ స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌లేక పోతున్నార‌న్న వాద‌న అయితే.. బ‌లంగానే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News